ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ రెజ్లర్లు మరోసారి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగేంతవరకు ఇక్కడి నుండి కదిలేది లేదని స్పష్టం చేశారు. బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఏడుగురు మహిళా రెజ్లర్ల బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ పోలీస్‌స్టేషన్‌లో మరోసారి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయలేదని రెజ్లర్ సాక్షి మాలిక్ మండిపడ్డారు. ఈ సమస్యపై ప్రభుత్వ ప్యానెల్ నివేదికను బహిరంగ పరచకపోవడం తమను నిరాశకు గురిచేస్తోందని అన్నారు. రెజ్లర్ల నుండి వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన నివేదికను బహిరంగ పరచాలని కోరుకుంటున్నామని అన్నారు. ఇది చాలా సున్నితమైన అంశమని, ఫిర్యాదు చేసిన వారిలో మైనర్ బాలిక కూడా ఉందని అన్నారు. ఫిర్యాదు దారుల పేర్లను లీక్ చేయవద్దని కోరారు. డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌ను అరెస్ట్ చేసేంతవరకు ఈ ఆందోళనను విరమించేది లేదని మరో రెజ్లర్ భజరంగ్ పూనియా పేర్కొన్నారు. గత మూడు నెలలుగా క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, సంబంధిత అధికారులను సంప్రదించడానికి యత్నిస్తున్నామని వినేష్ ఫోగట్ పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదని ధ్వజమెత్తారు. కమిటీ సభ్యులు కూడా స్పందించడం లేదని, తాము ఫోన్‌చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ దేశం కోసం పతకాలు సాధించిన తాము .. న్యాయం కోసం తమ భవిష్యత్తును పణంగా పెట్టామని ధ్వజమెత్తారు. ''మాకు న్యాయం జరిగేంతవరకు ఇక్కడే తింటాం, ఇక్కడే ఉంటాం'' అని అన్నారు.
జంతర్‌మంతర్ వద్ద మరోసారి ఆందోళనకు దిగిన రెజ్లర్లు
April 23, 2023
0
Tags