అమెరికా బెదిరింపులకు మేం భయపడం : చైనా

Telugu Lo Computer
0


మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమపై ప్రకటించిన 100 శాతం సుంకాలపై చైనా గట్టిగానే స్పందించింది. ఇలాంటి బెదిరింపులకు తాము భయపడబోమని, పోరాటానికి వెనుకాడబోమని తేల్చిచెప్పింది. అమెరికా ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తోందని మండిపడింది. అమెరికా అధ్యక్షుడి చర్యలు తమ దేశ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని ఆరోపింది. సాధారణంగా తాము ఎవరితోనూ గొడవలు, ఘర్షణలు పెట్టుకోమని, అవసరం వస్తే మాత్రం పోరాటానికి వెనుకడగువేయబోమని స్పష్టం చేసింది. అయితే, దీనికి ప్రతి చర్యలు కూడా ఉంటాయని పేర్కొంది. ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలు అమెరికా, చైనా ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని తెలిపింది. ఈ మేరకు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా రక్షణ, సాంకేతిక పరిశ్రమలకు అవసరమైన అరుదైన ఖనిజాలు, ఇతర ముఖ్య ఎగుమతులకు సంబంధించి చైనా ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్.. భారీ సుంకాలు విధిస్తానంటూ హెచ్చరించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ కూడా రద్దు చేసుకుంటానని ఆయన బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలోనే చైనాపై అదనంగా మరో 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించిన ట్రంప్, నవంబర్‌ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని తెలిపారు. అంతేకాదు, చైనా తీసుకునే తదుపరి చర్యలు ఆధారంగా అమెరికా నిర్ణయం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)