ఉక్రెయిన్‌పై 598 డ్రోన్లు, 31 తేలికపాటి క్షిపణులతో విరుచుకుపడిన రష్యా

Telugu Lo Computer
0


క్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరంపై గురువారం రష్యా 598 డ్రోన్లు, 31 తేలికపాటి క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 48 మందికి గాయాలైనట్లు ఉక్రెయిన్‌ పేర్కొంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మూడేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరు దేశాల అధ్యక్షులతోనూ మంతనాలు సాగిస్తున్నారు. ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడుతున్న క్రమంలో ఇటీవల రష్యా చేపట్టిన అతిపెద్ద దాడి ఇదే. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు ఉక్రెయిన్‌ వర్గాలు తెలిపాయి. తాజా ఘటనను ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు. చర్చలకు రాకుండా రష్యా బాలిస్టిక్‌ క్షిపణులను వినియోగిస్తోందని మండిపడ్డారు. '' శాంతిని కోరుకునే యావత్‌ ప్రపంచం తాజా ఘటనపై స్పందించాలి. గతంలో చాలా మంది శాంతి మంత్రం జపించారు. ఇప్పుడు మాత్రం మిన్నకుండిపోతున్నారు.'' అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. కీవ్‌ నగరంలోని దాదాపు 20 ప్రాంతాల్లో డ్రోన్‌ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. సుమారు 100 భవనాలు పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం. మరోవైపు 563 డ్రోన్లను, 26 క్షిపణులను విజయవంతంగా నేల కూల్చినట్లు ఉక్రెయిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వెల్లడించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సుంకాల పెంపు సహా, మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారని ఉక్రెయిన్‌ భావిస్తోంది. ఇదే విషయాన్ని జెలెన్‌స్కీ కూడా ప్రస్తావించారు. 'యుద్ధాన్ని ముగించేందుకు ఇచ్చిన అన్ని గడువులను రష్యా ఇప్పటికే అతిక్రమించింది. ఇరుదేశాల మధ్య శాంతి కుదిర్చేందుకు చేసిన దౌత్య ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి' అని అన్నారు. జెలెన్‌స్కీతో ప్రత్యక్షంగా శాంతి చర్చలు జరిపేందుకు అమెరికా చేసిన ప్రతిపాదనను పుతిన్‌ తిరస్కరించడంపై ఇటీవల ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యక్ష చర్చలకు షెడ్యూల్‌ ఖరారు కాకపోతే రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటానని గత శుక్రవారం ట్రంప్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు గురువారం రాత్రి ఉక్రెయిన్‌కు చెందిన 102 డ్రోన్లను నేల కూల్చినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. రష్యాలోని నైరుతి భాగమే లక్ష్యంగా ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులకు దిగుతున్నట్లు పేర్కొంది. క్రాస్‌నోడార్‌ ప్రాంతంలోని అఫిప్‌స్కీ చమురుశుద్ధి కర్మాగారంపై డ్రోన్‌ దాడి కారణంగా మంటలు చెలరేగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. సమర రీజియన్‌లోని మరో చమురు శుద్ధి కేంద్రం పైనా ఉక్రెయిన్‌ డ్రోన్‌తో దాడి చేసినట్లు తెలుస్తోంది. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు చమురుశుద్ధి కేంద్రాలనే ఉక్రెయిన్‌ ప్రధానంగా ఎంచుకుంటోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)