చైనాతో ఒక వాణిజ్య ఒప్పందం కుదిరింది.. త్వరలోనే భారత్‌తో చాలా పెద్ద ఒప్పందం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హింట్ ఇచ్చారు. దీంతో, భారత్‌తో ట్రంప్ ఎలాంటి ఒప్పందం కుదుర్చుకుంటారనే ఆసక్తి నెలకొంది. తాజాగా బిగ్ బ్యూటిఫుల్ బిల్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ 'ప్రతి ఒక్కరూ మాతో ఒప్పందం చేసుకోవాలని చూస్తున్నారు. మేము చైనాతో నిన్ననే ఒప్పందంపై సంతకాలు చేశాం. కొన్ని గొప్ప దేశాలతో ఒప్పందాలు కుదరనున్నాయి. త్వరలో భారత్‌తో ఒక భారీ డీల్ చేసుకోబోతున్నాం. అది చాలా పెద్దది. మేము భారత్‌లో మార్కెట్లను తెరవబోతున్నాం' అంటూ హింట్ ఇచ్చారు. ఇదే సమయంలో అమెరికా కొన్ని దేశాలతో ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధంగా లేదు. వారితో ఎలాంటి వాణిజ్యం ఉండదు. కొన్ని దేశాలకు కేవలం ఒక లేఖ పంపి.. 25, 35, లేదా 45 శాతం పన్నులు చెల్లించమని చెబుతాం. అదే సులువైన మార్గం' అని చెప్పుకొచ్చారు. అయితే, చైనాతో ఎలాంటి ఒప్పందం కుదిరింది అనే విషయాన్ని మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. ఈ క్రమంలో అమెరికా-చైనా మధ్య డీల్ ఏంటనే చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. ట్రంప్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో కొద్ది వారాల క్రితం ఢిల్లీ వేదికగా ఇరు దేశాల మధ్య జరిగిన కీలక చర్చల్లో పలు నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇరు దేశాల ప్రతినిధులు ఢిల్లీలో నాలుగు రోజుల పాటు రహస్యంగా చర్చలు జరిపారు. అమెరికా తరఫున ఆ దేశ వాణిజ్య ప్రతినిధి కార్యాలయ అధికారులు, భారత్ తరఫున వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన రాజేశ్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం ఈ చర్చల్లో పాల్గొంది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ సౌకర్యం కల్పించడం, సుంకాల తగ్గింపు, ఇతర అంశాలపై కీలక చర్చ జరిగింది. ఇక, ప్రస్తుతం 190 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడమే ఈ చర్చల ప్రధాన ఉద్దేశమని సమాచారం.
భారత్‌తో పెద్ద ఒప్పందం ఉంటుంది : డొనాల్డ్ ట్రంప్
June 27, 2025
0
Tags