వృద్ధాప్యానికి కళ్లెం వేసే విటమిన్‌ డి

Telugu Lo Computer
0

విటమిన్‌ డి శారీరక వయసు త్వరగా మీద పడకుండా చూడటానికీ తోడ్పడు తున్నట్టు మాస్‌ జనరల్‌ బ్రిగమ్, మెడికల్‌ కాలేజ్‌ ఆఫ్‌ జార్జియా తాజా అధ్యయనంలో తేలింది. మన క్రోమోజోముల చివర టోపీల మాదిరిగా టెలమిర్‌ అనే రక్షణ కవచాలుంటాయి. ఇవి క్రోమోజోమ్‌ చివర్లు క్షీణించకుండా, ఇతర క్రోమోజోములతో కలిసి పోకుండా కాపాడతాయి. కాకపోతే వయసు మీద పడుతున్నకొద్దీ టెలమిర్ల సైజు తగ్గుతూ వస్తుంటుంది. ఇవి మరీ పొట్టిగా అయితే శారీరక వయో ప్రక్రియలు ప్రేరేపితమవుతాయి. కణ విభజన నిలిచిపోవటానికి, వయసుతో ముడిపడిన జబ్బులకు కారణమవుతాయి. ఇక్కడే విటమిన్‌ డి రక్షణగా నిలుస్తోంది. దీన్ని మాత్రల రూపంలో తీసుకుంటే టెలమిర్లు పొట్టిగా అవకుండా కాపాడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో 55 ఏళ్లు పైబడిన మహిళలు, 50 ఏళ్లు పైబడిన మగవారిని ఎంచుకొని కొందరికి విటమిన్‌ డి3 (రోజుకు 2,000 ఐ/యూ), మరికొందరికి ఒమేగా 3 కొవ్వు ఆమ్లం (రోజుకు ఒక గ్రాము) తీసుకోవాలని సూచించారు. నాలుగేళ్ల తర్వాత పరిశీలించగా విటమిన్‌ డి తీసుకున్నవారిలో టెలమిర్లు పొట్టిగా అయ్యే ప్రక్రియ గణనీయంగా మందగించినట్టు తేలింది. అయితే ఒమేగా 3 కొవ్వు ఆమ్లం పెద్దగా ప్రభావమేమీ చూపలేదు. శారీరక వయో ప్రక్రియ నెమ్మదించటానికి విటమిన్‌ డి మాత్రలు తోడ్పడుతున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నప్పటికీ దీనిపై మరింత పరిశోధన చేయాల్సిన అవసరముందని పరిశోధకులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వంటి వాటికి దీన్ని ప్రత్యామ్నాయంగా పరిగణించొద్దని, మాత్రల కన్నా ఆహారం, జీవనశైలికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. కాకపోతే ఒంట్లో వాపు ప్రక్రియ పెద్దమొత్తంలో ఉన్నవారికి లేదా దీర్ఘకాల జబ్బుల ముప్పు అధికంగా ఉన్నవారికి మాత్రలు మేలు చేసే అవకాశముందని చెబుతున్నారు. విటమిన్‌ డిని పొందటానికి ముఖ్యమైన, సహజమైన మార్గం చర్మానికి ఎండ తగిలేలా చూసుకోవటం. సూర్యరశ్మి సమక్షంలో శరీరమే దీన్ని తయారు చేసుకుంటుంది. సాల్మన్‌ వంటి చేపలు, గుడ్డు పచ్చసొన, కాడ్‌ లివర్‌ ఆయిల్‌ వంటి ఆహార పదార్థాలతోనూ ఇది లభిస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)