శర్మిష్ఠ పనోలీకు బెయిల్‌ నిరాకరించిన హైకోర్టు

Telugu Lo Computer
0


న్యాయ విద్యార్థి శర్మిష్ఠ పనోలీకు కోల్‌కతా హైకోర్టులో నిరాశే మిగిలింది. తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆమె చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఆపరేషన్‌ సిందూర్‌పై సినీ ప్రముఖులు మౌనం వహించడంపై శర్మిష్ఠ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టింది. స్వేచ్ఛగా మాట్లాడడం అంటే ఇదేనా అని మండిపడింది. వాక్‌ స్వాతంత్ర్యం సంపూర్ణం కాదని.. మతపరమైన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలను దెబ్బతీసేందుకు ఈ హక్కు వీలు కల్పించలేదని గుర్తు ఉంచుకోవాలి అని హైకోర్టు హితవు పలికింది. ''ఆమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేసింది. ఒక వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించారు. వాక్‌ స్వాతంత్ర్యం ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కానీ, ఇతరులను బాధపెట్టేలా మాట్లాడమని దాని అర్థం కాదు. మన దేశం వైవిధ్యభరితమైనది. అనేక కులాల, మతాల ప్రజలు ఇక్కడ కలిసి జీవిస్తున్నారు. అలాంటప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి'' అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. శర్మిష్ఠకు మధ్యంతర బెయిల్ మంజూరుకు నిరాకరించిన కోర్టు.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కాగా ఉగ్రవాదులు పహల్గాంలో పురుషులపై జరిపిన మారణహోమం తర్వాత భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'పై కొందరు బాలీవుడ్‌ ప్రముఖుల మౌనాన్ని ప్రశ్నిస్తూ మే 14న శర్మిష్ఠ సోషల్‌ మీడియా వేదికగా చేసిన వీడియో పోస్ట్‌ వివాదాస్పదంగా మారింది. ఆమె పోస్టుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత తన పోస్టులు, రీల్స్ తొలగించిన ఆమె క్షమాపణలు కోరారు. అనంతరం శర్మిష్ఠను పోలీసులు అరెస్టు చేశారు. కోల్‌కతా పోలీసుల చర్య భారత్‌లోని వాక్‌స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందని టీఎంసీ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఆమెను వెంటనే విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే శర్మిష్ఠ పనోలీ బెయిల్‌ అభ్యర్థనను నిరాకరించిన న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)