కెనడా నుంచే ఖలిస్థానీల కుట్రలు : కెనడియన్‌ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ నివేదిక

Telugu Lo Computer
0


కెనడా నుంచే ఖలిస్థానీ అతివాదులు కుట్రలకు ప్రణాళికలు చేస్తున్నది నిజమేనని అంగీకరించింది. ఈమేరకు కెనడియన్‌ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ తమ వార్షిక భద్రత రిపోర్ట్‌లో వెల్లడించింది. ''భారత్‌లో హింసను ప్రోత్సహించడానికి, దాడులు చేయడానికి అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు ఖలిస్థానీ అతివాదులు కెనడాను తమ స్థావరంగా వినియోగించుకుంటున్నారు'' అని కెనడా నిఘా సంస్థ తమ నివేదికలో తెలిపింది. ఖలిస్థానీలకు సంబంధించి 'అతివాదులు' అనే పదాన్ని ఒట్టావా ఉపయోగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. భారత్‌లోని పంజాబ్‌ ప్రాంతంలో ప్రత్యేక ఖలిస్థానీ దేశం తీసుకురావాలని ఈ అతివాదులు కుట్రలు చేస్తున్నారని ఆ నివేదికలో పేర్కొంది. దౌత్య విభేదాలను పరిష్కరించుకునేలా భారత్‌-కెనడా ప్రధానులు ఇటీవల భేటీ అయిన వేళ ఈ నివేదిక రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కెనడా గడ్డపై ఖలిస్థానీ వేర్పాటువాదులు భారత వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారని భారత్‌ కొన్నేళ్లుగా వాదిస్తూనే ఉంది. 1985లో ఎయిరిండియా విమానం కూల్చివేత, ఆ తర్వాత భారత్‌లో చోటుచేసుకున్న పలు ఉగ్ర ఘటనలను ప్రస్తావిస్తూ అనేకసార్లు కెనడా దృష్టికి తీసుకెళ్లింది. అయితే ఒట్టావా మాత్రం దీనిపై దృష్టిపెట్టేందుకు ఆసక్తి చూపించలేదు. ఈ క్రమంలోనే 2023లో ఖలిస్థానీ వేర్పాటువాద నేత హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య ఘటనతో ఇరుదేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అతడి హత్య వెనక భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ స్వయంగా నాటి ప్రధాని జస్టిన్‌ ట్రూడోనే ఆరోపించడంతో దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, కెనడాలో కొత్తగా ఏర్పడిన మార్క్‌ కార్నీ ప్రభుత్వం.. న్యూదిల్లీతో బంధాన్ని పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల జీ7 సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీతో కార్నీ భేటీ అయ్యారు. ఇరు దేశాల్లో హైకమిషనర్లను మళ్లీ నియమించుకునేందుకు ఇద్దరు దేశాధినేతలు అంగీకరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)