ఉక్రెయిన్ డ్రోన్ల దాడికి తాము బదులుతీర్చుకుంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తనతో చాలా గట్టిగా చెప్పారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ధృవీకరించింది. ప్రతీకార దాడులు చేయాలన్న తమ ప్లాన్ గురించి ఫోన్ కాల్‌లో ట్రంప్‌నకు వెల్లడించినట్లు తెలిపింది. బుధవారం పుతిన్‌తో 75 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడానని, సంభాషణ సవ్యంగానే కొనసాగినప్పటికీ ఉక్రెయిన్- రష్యా మధ్య శాంతి సాధనకు అది ఉపకరించదని సామాజిక మాధ్యమంలో ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే క్రెమ్లిన్ స్పందన వచ్చింది. తుర్కియే నగరం ఇస్తాంబుల్ వేదికగా రష్యా, ఉక్రెయిన్ మధ్య మరోసారి శాంతి చర్చలు జరగనున్న వేళ 'స్పైడర్ వెబ్' పేరుతో గత ఆదివారం మునుపెన్నడూ లేని రీతిలో ఉక్రెయిన్ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఏకంగా రష్యా భూభాగంలోకి కంటెయినర్లలో డ్రోన్లను తరలించి వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు చేపట్టింది. ఈ ఘటనలో రష్యాకు చెందిన 41 యుద్ధ విమానాలు, పలు ఎయిర్ బేస్‌లు ధ్వంసం అయ్యాయి. రష్యా భూభాగంలోని 4,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇర్కుట్స్క్ ప్రాంతంలోని వైమానిక స్థావరంలోకి వెళ్లి మరీ డ్రోన్లు దాడులు చేశాయి. ఈ దాడిలో టీయూ-95, టీయూ-22ఎం3 బాంబర్లు, కీలకమైన ఏ-50 ఎయిర్ క్రాఫ్ట్‌లు ఈ ఘటనలో ధ్వంసం అయ్యాయి. మూడేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధంలో ఈ ఘటన మాస్కోకు పెద్ద కుదుపు కాగా, ఉక్రెయిన్ దళాలకు మరింత ఆత్మస్థైర్యం లభించినట్టు అంతర్జాతీయ విశ్లేషకులు తెలిపారు. ఈ పరిణామాల వేళ రష్యా గురువారం ఉక్రెయిన్‌లోని ప్రైలుకీ నగరంలో డ్రోన్ల దాడి జరిపింది. అవి నివాస ప్రాంతాన్ని తాకాయని, ఒక ఏడాది బిడ్డ సహా ఐదుగురు మృతిచెందారని అధికారులు వెల్లడించారు. ఆ నగరం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు 100 కి.మీ.దూరంలో ఉంది. అక్కడ ఎలాంటి మిలిటరీ ఆస్తులు లేవు. ఇక ప్రైలుకీతో పాటు మిగిలిన నగరాలను కూడా 103 డ్రోన్లు తాకాయని అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు.
పుతిన్ గట్టిగానే చెప్పారన్న డొనాల్డ్ ట్రంప్ : ధృవీకరించిన క్రెమ్లిన్
June 05, 2025
0
Tags