'ఏక్ పేడ్ మాకే నామ్' నినాదంతో మొక్కలు నాటండి : కేంద్ర మంత్రి బండి సంజయ్

Telugu Lo Computer
0

ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు న్యూఢిల్లీ జంతర్ మంతర్‌లోని తన అధికారిక నివాసంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మొక్కలు నాటారు. తన కార్యాలయ సిబ్బందితో కూడా మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాతావరణ మార్పులపై పోరాటానికి, భవిష్యత్ తరాల పరిరక్షణకు మొక్కలు నాటడమే శరణ్యమని మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా భారతీయ పౌరులందరూ తమ తల్లి పేరుతో ఒక్కో మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపాడాలని పిలుపునిచ్చారు.  ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. మొక్కల పెంపకం ద్వారా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని కోరారు. వాతావరణ మార్పులపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, అలాగే జీవ వైవిధ్య పరిరక్షణ, భవిష్యత్ తరాలకు హరిత భూమిని అందించేందుకు మనమంతా సామూహిక బాధ్యతగా భావించాలని అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగితోపాటు ప్రతీ భారతీయ పౌరుడు 'ఏక్ పేడ్ మాకే నామ్' నినాదంతో తమ తల్లి పేరుతో ఒక్కో మొక్కను నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్ఘాటించారు. తద్వారా పర్యావరణ పరిరక్షణ అనేది ఇంటి నుంచే ప్రారంభమవుతుందని, తల్లుల అనురాగానికి, పోషణకు గుర్తుగా మొక్కలు నాటడం ఒక అర్థవంతమైన నివాళి అవుతుందని బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)