ఢిల్లీలోని ద్వారకాలో ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం 30మందికి పైగా విద్యార్థుల పట్ల దారుణంగా ప్రవర్తించింది. వారి తల్లిదండ్రులు సమయానికి ఫీజు చెల్లించడంలో విఫలమయ్యారనే కారణంతో బహిరంగంగా వారిని అవమానించింది. విద్యార్థులను స్కూల్ జాబితాలో నుంచి తొలగించింది. వారిని స్కూల్‌కి రాకుండా చేసింది. అందుకోసం సిబ్బందిని కూడా నియమించింది. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు పాఠశాల యజమాన్య చర్యపై అసహనం వ్యక్తం చేసింది. ''కేవలం డబ్బు కోసం విద్యార్థుల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం సరికాదు. ఫీజు కోసం వారిని బలవంతం చేయడం, బెదిరించడం ఆమోదయోగ్యం కాదు. అలా చేయడం ద్వారా విద్యార్థిని మానసికంగా వేధించడమే అవుతుంది. పాఠశాలలు వాణిజ్య సంస్థల్లా ప్రవర్తించకూడదు. విద్యార్థులను లోనికి రానివ్వకుండా చేయడం విద్యా సంస్థల ప్రాథమిక ధర్మానికి విరుద్ధం. డబ్బు అర్జించడమే లక్ష్యంగా పాఠశాలలు నెలకొల్పలేదు. విద్యార్థులకు చదువుతో పాటు విలువలు కూడా నేర్పించడం దాని ప్రధాన విధి. పాఠశాలలకు ఫీజుల చెల్లింపునకు సంబంధించి కోర్టు జారీ చేసిన ఆదేశాలు తల్లిదండ్రులు తప్పక పాటించాల్సి ఉంటుంది'' అని న్యాయస్థానం పేర్కొంది.
ఫీజు పేరుతో విద్యార్థిని మానసికంగా వేధించడమే : ఢిల్లీ హైకోర్టు
June 05, 2025
0
Tags