దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్, దేర్ అల్-బలా నగర శివార్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కొనసాగిన ఈ దాడుల్లో 82 మంది మృతి చెందినట్లు అక్కడి ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మృతదేహాలను నాజర్ ఆస్పత్రికి తరలించారని ఆరోగ్య అధికారులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్యం పర్యటనలో ఉండగా గాజాపై ఇజ్రాయెల్ విస్తృతమైన దాడులకు పాల్పడడం గమనార్హం. కాగా తాజా దాడులపై ఇజ్రాయెల్ సైన్యం ఎటువంటి ప్రకటనా చేయలేదు. బుధవారం టెల్‌అవీవ్ గాజాపై చేసిన దాడుల్లోనూ 70 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఇటీవల అగ్రరాజ్యం మధ్యవర్తిత్వంతో హమాస్-ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో ఇరువర్గాలు బందీలను విడుదల చేస్తున్నాయి. గాజాతో యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటీవల మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో తమ యుద్ధాన్ని ఆపడానికి ఎటువంటి మార్గం లేదని స్పష్టంచేశారు. హూతీలు తమపై దాడులు జరపడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. హూతీలను కచ్చితంగా ఎదురుదెబ్బ తీస్తామన్న ఆయన గతంలో ఐడీఎఫ్ చేసిన దాడులను గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈసారి దాడులు మామూలుగా ఉండవని.. బాంబుల మోతలతో హోరెత్తుతాయని హెచ్చరించారు. దీంతో యుద్ధ విరమణ ఆశలు సన్నగిల్లాయి. గాజాలోని పాలస్తీనియన్లు ఖాళీ చేయాలని గతంలో ప్రతిపాదించిన ట్రంప్ గురువారం పశ్చిమాసియాలో మాట్లాడుతూ.. గాజాను అమెరికా అధీనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. గాజాలో కూలిన శిథిలాల కిందే ప్రజలు ఉంటున్నారని..అది ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. గాజాకు సంబంధించి తనకు మంచి ఆలోచనలు ఉన్నాయని, ఆ ప్రాంతాన్ని స్వేచ్ఛా మండలంగా మలచడానికి కృషి చేస్తానని అన్నారు.
ఇజ్రాయెల్ భీకర దాడులలో 82 మంది మృతి
May 16, 2025
0
Tags