ఉక్రెయిన్‌లో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా

Telugu Lo Computer
0


క్రెయిన్‌లో తాత్కాలిక కాల్పుల విరమణను రష్యా ప్రకటించింది. విక్టరీ డే నేపథ్యంలో వచ్చే నెల 8 నుంచి 10వ తేదీవరకు పూర్తిస్థాయి కాల్పుల విరమణ పాటిస్తామని క్రెమ్లిన్‌ వెల్లడించింది. మానవతా దృక్పథంతో దేశాధ్యక్షుడు పుతిన్ ఈమేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ ఈ ప్రకటన వెలువడింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా ప్రభుత్వం ఏటా మే 9న విక్టరీ డే వేడుకలు నిర్వహిస్తుంది. శాంతి ఒప్పందానికి రష్యా, ఉక్రెయిన్‌లు అతి సమీపానికి వచ్చాయని, త్వరలో ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగే అవకాశం ఉందని ట్రంప్‌ ఇటీవల పేర్కొన్నారు. ఈ క్రమంలోనే.. వాటికన్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమైన అనంతరం పుతిన్‌పై విరుచుకుపడ్డారు. ఆయనకు యుద్ధం ఆపాలన్న ఉద్దేశం ఉన్నట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. క్రిమియా విషయంలో మాత్రం పలు సందర్భాల్లో మాస్కోకు మద్దతుగా ట్రంప్‌ ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. క్రిమియాపై రష్యా అధికారాన్ని మాత్రం అంగీకరించే ప్రసక్తే లేదని ఉక్రెయిన్‌ స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)