అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న సంపన్నుడు ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని టెస్లా విద్యుత్ కార్ల సంస్థకు చెందిన ఆస్తులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఈనేపథ్యంలో ట్రంప్ నుంచి స్పందన వచ్చింది. టెస్లా కార్లపై దాడికి పాల్పడేవారికి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడేందుకు మంచి అవకాశం ఉందని వ్యంగ్యంగా పోస్టు పెట్టారు. ఈ దాడులను ప్రోత్సహిస్తోన్న వారికి కూడా శిక్ష తప్పదని హెచ్చరించారు. అమెరికా, ఇతర దేశాల్లో టెస్లా షోరూమ్‌లు, విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లతోపాటు కార్ల పైనా ఇటీవల దాడులు చోటుచేసుకున్నాయి. భద్రత కరవైందన్న కారణంగా కెనడాలో అంతర్జాతీయ వాహన ప్రదర్శన నుంచి టెస్లా తన ఉత్పాదనలను ఉపసంహరించుకుంది. మస్క్‌ను ప్రభుత్వ సామర్థ్య పెంపుదల విభాగం (డోజ్) అధినేతగా ట్రంప్ నియమించినప్పటి నుంచీ టెస్లాపై దాడులు బాగా పెరిగిపోయాయి. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాలన్న మస్క్ సలహా మేరకు ట్రంప్ ప్రభుత్వం ఎందరో ప్రభుత్వోద్యోగులకు ఉద్వాసన పలకడంతోపాటు పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. మస్క్ విధానాలను వ్యతిరేకిస్తున్నవారు ఉత్తర అమెరికా, యూరప్‌లలోని ఆయన కార్యాలయాలు, కర్మాగారాల ఎదుట ఆందోళనలు నిర్వహించారు. మస్క్‌తో విభేదిస్తున్న పలువురు సెనేటర్లు తమ టెస్లా కార్లను విక్రయించేస్తామని ప్రతినబూనారు. మరోవైపు లాస్‌వెగాస్‌లో టెస్లా షోరూంలోని ఐదు కార్లకు దుండగులు నిప్పంటించారు. అనంతరం ఒక కారుపై అభ్యంతరకర పదజాలంతో స్ప్రే పెయింట్ వేశారు. టెస్లా ఉత్పత్తి చేసిన వాహనాలపై పేలుడు పదార్థాన్ని విసిరిన ఘటనకు సంబంధించి పోలీసులు గత నెలలో ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. చార్లెస్టన్ సమీపంలో టెస్లా ఛార్జింగ్ స్టేషన్లను తగలబెట్టిన ఒక వ్యక్తిని సౌత్ కరోలినాలో అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. టెస్లాపై దాడులకు దిగేవారు నరకాన్ని అనుభవించబోతున్నారని ట్రంప్ హెచ్చరించారు. ఈక్రమంలోనే తన సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్టు పెట్టారు.
టెస్లాపై దాడి చేస్తే జైలు శిక్ష పడేందుకు మంచి అవకాశం : వ్యంగ్యంగా పోస్టు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
March 21, 2025
0
Tags