జమీయత్‌ ఉలేమా నేత ముఫ్తీ అబ్దుల్ ను కాల్చి చంపిన దుండగులు !

Telugu Lo Computer
0


పాకిస్తాన్‌లోని క్వెట్టాలో ఆదివారం రాత్రి జమీయత్‌ ఉలేమా ఈ ఇస్లాం సీనియర్‌ నేత ముఫ్తీ అబ్దుల్ బాకీ నూర్జాయ్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడిలో ముఫ్తీ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తీవ్రగాయాల కారణంగా ముఫ్తీ మరణించారని తెలిపారు. పాక్‌ భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించాయి. దాడి చేసిన అనంతరం దుండగులు అ‍క్కడి నుంచి పరారయ్యారు. ఇటీవలి కాలంలో పాక్‌లో ఉగ్ర దాడులు మరింతగా పెరిగాయి. ఆదివారం క్వెట్టా నుండి టఫ్తాన్ వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్ర దాడిలో ఏడుగురు సైనికులు మరణించగా, 21 మంది గాయపడ్డారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ఒక ప్రకటన చేసింది. ఇదేవిధంగా మార్చి 11న క్వెట్టా నుండి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బీఎల్‌ఏ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. బోలాన్‌లోని మష్ఫాక్ టన్నెల్‌ వద్ద ఈ ఘటన జరిగింది. తాజాగా జరిగిన దాడి క్వెట్టాలో వరుసగా మూడవది. ఈ ప్రాంతంలో పెరుగుతున్న అస్థిరత, ఉగ్రవాద కార్యకలాపాలకు తార్కాణంగా ఇది నిలిచింది. ముఫ్తీ అబ్దుల్ బాఖీ నూర్జాయ్ హత్య వెనుక గల కారణం ఇంకా వెల్లడి కాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)