తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. పథకం విధివిధానాలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత యువతకు భారీగా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలోని దాదాపు 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేందుకు రూ.6 వేల కోట్లకు పైగా నిధులు ఖర్చుచేయాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ ప్రారంభమై ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. చాలా రోజుల తర్వాత స్వయం ఉపాధి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుండటంతో భారీ సంఖ్యలో అప్లికేషన్లు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ దాదాపు రూ.1200 కోట్లు, గిరిజన ఆర్థిక సహకార సంస్థ రూ.360 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలో కూడా ప్రత్యేక అభివృద్ధి నిధులు భారీగా ఉన్నాయి. దీంతో ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులకు స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీల్లో ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేలా బీసీ కార్పొరేషన్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. తొలి ఏడాది 1.5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలని రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బడ్జెట్‌లో కేటాయించిన రూ.2 వేల కోట్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులను ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. ఈ పథకం కింద లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు యూనిట్ల విలువ ఆధారంగా రుణాలను 3 క్యాటగిరీలుగా విభజించారు. క్యాటగిరీ-1 కింద రూ.లక్ష వరకు రుణం అందిస్తారు. అందులో 80 శాతం రాయితీ ఉంటుంది. క్యాటగిరీ-2 కింద రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తారు. అందులో 70 శాతం రాయితీ కల్పిస్తారు. క్యాటగిరీ-3 కింద రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల లోపు రుణాలను అందజేయనున్నారు. అందులో 60 శాతం రాయితీ లభిస్తుంది.
రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు రుణాలు !
March 17, 2025
0
Tags