రష్యాకు లొంగిపోయేలా చేయడానికే అమెరికా మిలిటరీ సాయం నిలిపివేత !

Telugu Lo Computer
0


ష్యాతో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో కీవ్‌కు సైనిక సాయం నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఉక్రెయిన్‌ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అగ్రరాజ్యం తమకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలు క్రమంగా తమ దేశాన్ని రష్యాకు లొంగిపోయేలా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నట్లు ఉన్నాయని ఆ దేశ పార్లమెంటరీ విదేశీ వ్యవహారాల కమిటీ చీఫ్‌ మెరెజ్‌కో ఆరోపించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి మధ్య వాగ్వాదం నెలకొన్న నేపథ్యంలో కీవ్‌పై ఒత్తిడి తీసుకురావడానికే ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని యూరోపియన్‌ దేశాలు ఆరోపించాయి. అగ్రరాజ్యం సాయం లేకుండా కీవ్‌ రష్యాతో పోరాటం చేయగలదా అని ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రకటన వెలువడిన అనంతరం ఐరోపా దేశాల నేతలు అత్యవసర చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. జర్మనీ తదుపరి ఛాన్స్‌లర్‌గా బాధ్యతలు చేపట్టనున్న ఫ్రెడరిక్ మెర్జ్ అమెరికా ప్రకటనను వ్యతిరేకించారు. ట్రంప్‌ నిర్ణయం ఉక్రెయిన్‌ రక్షణ ప్రయత్నాలను మరింత బలహీనపరిచే ఉద్దేశపూర్వక చర్యగా ఉందని అన్నారు. అగ్రరాజ్యం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉక్రెయిన్‌కు ఇప్పటికే అందుబాటులో ఉన్న వందల మిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాలపై ప్రభావం పడనుందని ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ట్రంప్‌తో సమావేశం అనంతరం జెలెన్‌స్కీ లండన్‌లో నిర్వహించిన ఐరోపా దేశాధినేతల సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మాట్లాడుతూ అమెరికాతో ఖనిజాల ఒప్పందానికి తాము సిద్ధమేనని పేర్కొన్నారు. రష్యాతో యుద్ధం ముగింపు ఇంకా సుదూరతీరంలోనే ఉందని, అప్పటివరకు అగ్రరాజ్యం సహకారం అందుతుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో మిలిటరీ సాయం నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)