కెనడా ఇంధన ఎగుమతులపై 10 శాతం టారిఫ్ విధించిన అమెరికా !

Telugu Lo Computer
0


కెనడాపై ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై 25 శాతం భారీ సుంకాన్ని ట్రంప్ విధించారు. ఇది చాలదన్నట్టు కెనడా ఇంధన ఎగుమతులపై 10 శాతం టారిఫ్ విధించారు. ఈ నిర్ణయాలు కెనడా నేతలను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికాకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా, సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్‌తో ఉన్న 100 మిలియన్ డాలర్ల భారీ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఒప్పందం కింద ఒంటారియోలోని 15 వేల ఇళ్లు, వాణిజ్య సముదాయాలకు ఇంటర్నెట్ సదుపాయం అందాల్సి ఉంది. "ఒంటారియోను అమెరికా ధ్వంసం చేస్తుంటే.. చూస్తూ ఊరుకోను. చిరునవ్వుతోనే చేయాల్సిందంతా చేస్తాను" అని డగ్ ఫోర్డ్ హెచ్చరించారు. ట్రంప్ చర్యలకు దీటుగా స్పందిస్తామని, కరెంట్ కోతలు విధిస్తామని హెచ్చరించారు. కెనడా స్టోర్ల నుంచి యూఎస్ ఆల్కహాల్‌ను తొలగిస్తామని ప్రకటించారు. ట్రంప్ కెనడా ప్రజలను తక్కువ అంచనా వేస్తున్నారని మండిపడ్డారు. అమెరికాకు అత్యధికంగా ఇంధనాన్ని సరఫరా చేసేది కెనడానే. కెనడాకు చెందిన ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, హైడ్రోపవర్, సహజవాయువు, విద్యుత్ పైనే అమెరికా ఎక్కువగా ఆధారపడింది. ఇప్పుడు కెనడా ప్రతీకార చర్యలకు దిగితే, అమెరికా ఇంధన సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. "వారు మా ఇంధనంపై ఆధారపడ్డారు. వాళ్లు కూడా నొప్పి భరించాలి" అని ఫోర్డ్ చేసిన వ్యాఖ్యలు అమెరికాను హెచ్చరించేలా ఉన్నాయి. ట్రంప్ నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిరకాల మిత్రదేశం, పొరుగుదేశం అయిన కెనడాపై ట్రంప్ సుంకాలు విధించడం ఏంటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. "సన్నిహిత మిత్రులు, పొరుగువారిపై ఎందుకు దాడి చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. కెనడాపై సుంకం అంటే అమెరికన్లపై పన్ను విధించడం కిందికే వస్తుంది" అని ఫోర్డ్ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)