భారత్, ఇండోనేసియాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. ముఖ్యంగా రక్షణ ఉత్పత్తుల తయారీ, వాణిజ్య రంగాల్లో పరస్పరం మేలు జరిగేలా ముందుకు వెళ్లేందుకు అంగీకరించాయి. ఈ మేరకు ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో, ప్రధాని మోడీ మధ్య జరిగిన సమావేశంలో ఒప్పందం కుదిరింది. సుబియాంతో మూడు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం దిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. శనివారం సమావేశం ముగిసిన అనంతరం ఇరుదేశాల నేతలు మీడియాతో మాట్లాడారు. భారత్‌కు ఇండోనేసియా కీలక భాగస్వామి అని మోదీ వ్యాఖ్యానించారు. 10 సభ్యదేశాలు కలిగిన ఆసియాన్‌తో పాటు ఇండో పసిఫిక్ కూటమిలో ఇండోనేసియాకు భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సంబంధాలను నెరపేందుకు ఇరుదేశాలు అంగీకరించినట్లు తెలిపారు. ద్వైపాక్షిక విధానాలకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించినట్లు మోదీ వెల్లడించారు. రక్షణ ఉత్పత్తుల తయారీ రంగంలో భారత్, ఇండోనేసియా కలిసి పని చేయబోతున్నట్లు చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనానౌకల సంచారం పెరుగుతున్న నేపథ్యంలో సముద్ర రక్షణను బలోపేతం చేసే దిశగా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. కృత్రిమమేధ, ఇంటర్నెట్, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనపై ఇరుదేశాలు పరస్పర సహకార ఒప్పందం కుదుర్చుకున్నాయి. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు ఇండోనేసియా కూడా సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు సుబియాంతో అన్నారు. ఫిన్‌టెక్, ఏఐ, ఐవోటీ, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
భారత్, ఇండోనేసియా మధ్య కీలక ఒప్పందాలు !
January 25, 2025
0
Tags