అత్యాధునిక చిప్స్‌ ఎగుమతులపై నెదర్లాండ్‌ ఆంక్షలు !

Telugu Lo Computer
0


చైనా - అమెరికా మధ్య మొదలైన చిప్‌ యుద్ధంలో మరో దేశం వచ్చి చేరింది. ఐరోపాలోని నెదర్లాండ్‌ ఈ ఏడాది వేసవి ముందు నుంచి అత్యాధునిక చిప్స్‌ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తామని పేర్కొంది. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు డచ్‌ ప్రభుత్వం వెల్లడించింది. వీటిల్లో అత్యంత కీలకమైన ఏఎస్‌ఎంఎల్‌ సంస్థ అభివృద్ధి చేసిన చిప్‌ టెక్నాలజీ కూడా ఉండనుంది. ప్రపంచ చిప్స్‌ తయారీ విభాగంలో ఏఎస్‌ఎంఎల్‌ చాలా ముఖ్యమైన సంస్థ. దీంతో ఫోన్ల నుంచి ఆయుధాల వరకు ఉపయోగించే సెమీకండక్టర్ల తయారీలో ముఖ్యమైన దశలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ''నెదర్లాండ్స్‌ జాతీయ, అంతర్జాతీయ భద్రతను దృష్టిలోపెట్టుకొని వీలైనంత తర్వగా ఈ టెక్నాలజీని నియంత్రణ పరిధిలోకి తీసుకొస్తోంది. సాంకేతిక అభివృద్ధి, భౌగోళిక రాజకీయాల కోణంలోనే ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నారు'' అని ఆ దేశ వాణిజ్య మంత్రి లీస్జే ష్రైనెమెకర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె చట్టసభ సభ్యులకు లేఖ రాశారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం కంపెనీలు అత్యాధునిక లిథోగ్రఫీ టెక్నాలజీని ఎగుమతి చేసే సమయంలో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై ఏఎస్‌ఎంఎల్‌ సంస్థ స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. 'మా అత్యాధునిక ఇమ్మెర్షన్‌ డీయూవీ సిస్టమ్స్‌పైనే ఈ ఆంక్షల ప్రభావం ఉంటుంది. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులు బేరీజు వేసుకొంటే మా ఆర్థిక పరిస్థితులపై దీని ప్రభావం ఏమీ ఉండకపోవచ్చు' అని పేర్కొంది. 2019లో డచ్‌ ప్రభుత్వం ఏఎస్‌ఎంఎల్‌ నుంచి అత్యాధునిక లిథోగ్రఫీ యంత్రాలను చైనాకు విక్రయించకుండా అడ్డుకొంది. మరోవైపు గతేడాది అక్టోబర్‌లో అమెరికా సరికొత్త లైసెన్సింగ్‌ విధానం తెచ్చింది. అమెరికా పరికరాలు, సాంకేతికత ఉపయోగించి తయారు చేసిన చిప్స్‌ను చైనాకు విక్రయించే కంపెనీలు తొలుత తమ వద్ద అనుమతులు తీసుకోవాలని వాషింగ్టన్‌ ప్రకటించింది. అదే సమయంలో నెదర్లాండ్స్‌, జపాన్‌ కూడా ఇదే విధానం అనుసరించాలని అమెరికా ఒత్తిడి చేసింది. వాణిజ్య యుద్ధంలో సెమీకండెక్టర్‌ అత్యంత కీలక ఆయుధం. ఏఎస్‌ఎంల్‌ సంస్థ చైనాలోని సెమీకండక్టర్‌ మాన్యూఫాక్చరింగ్‌ ఇంటర్నేషనల్‌ కార్ప్‌కు ఈయూవీ యంత్రాలు విక్రయించకుండా ఆపేశారు. వాస్తవానికి ఏఎస్‌ఎంల్‌కు ఈయూవీ యంత్రం తయారీకి  సరఫరా సంస్థలు ఉన్నాయి. వీటిలో అమెరికా కంపెనీలు కూడా ఉన్నాయి. 2019లో ట్రంప్‌ కార్యవర్గం డచ్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చి అత్యాధునిక ఈయూవీ యంత్రాల్ని విక్రయించడానికి అనుమతులు మంజూరు కానివ్వలేదు. దీంతో పశ్చిమ దేశాలతో పోల్చుకుంటే చైనా అత్యంత సూక్ష్మ సెమీకండక్టర్ల విషయంలో బాగా వెనుకపడిపోయే పరిస్థితి తలెత్తింది.

Post a Comment

0Comments

Post a Comment (0)