జుబీన్ గార్గ్ మృతి కేసులో పోలీస్ ఆఫీసర్ అరెస్టు !

Telugu Lo Computer
0


ప్రముఖ పంజాబీ గాయకుడు జుబీన్ గార్గ్ మృతి కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అెరెస్ట్ చేయగా, ఐదో అరెస్ట్ గా పోలీస్ ఆఫీసర్‌కు అదుపులో తీసుకున్నారు. ఈ ఆఫీసర్ మృతుడు జుబీన్ గార్గ్‌కి దగ్గరి బంధువు, అస్సాం పోలీస్ సర్వీస్‌కు చెందిన డిప్యూటీ సూపరింటెండెంట్ (డీఎస్పీ) సంధిపన్ గార్గ్‌గా పని చేస్తున్న ఈయన్ను ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. జుబీన్ గార్గ్‌తో పాటు సింగపూర్‌కు వెళ్లిన సంధిపన్, జుబీన్ గార్గ్ మరణించిన సమయంలో జరిగిన యాచ్ పార్టీలో పాల్గొన్నాడు. ఐదు రోజుల విచారణ అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జుబీన్ గార్గ్ మరణం కేసులో అరెస్టయిన నిందితులందరిపై హత్యా నేరం, క్రిమినల్ కుట్ర, నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం కావడం వంటి కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గురువారం ఉదయం సంధిపన్ గార్గ్‌ను స్థానిక కోర్టులో హాజరు పరచగా 14 రోజుల కస్టడీని కోరిన ఎస్‌ఐటీకి న్యాయస్థానం ఏడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది. జుబీన్ గార్గ్ సెప్టెంబరు 19వ తేదీన సింగపూర్‌లో జరిగిన 'నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్' కోసం అక్కడికి వెళ్లారు. ఈ పర్యటనలోనే 52 ఏళ్ల జుబీన్.. ఒక యాచ్ పార్టీలో ఈత కొట్టడానికి వెళ్లి, నీటిలో బోర్లా తేలుతూ కనిపించి మరణించారు. అప్పటికే ఆయనకు అనారోగ్య సమస్యలు ఉండడం, నీటిలోకి వెళ్లకూడదని అప్పటికే అతడికి వైద్యులు చెప్పడం వంటివి తెరపైకి రావడంతో ఇతడి మృతిపై అనుమానాలు మొదలయ్యాయి. ఇలా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలోనే అనుమానం ఉన్న వారందరినీ అదుపులోకి తీసుకుంటూ విచారిస్తున్నారు. అయితే ఇప్పటికే జుబీన్ బ్యాండ్‌మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి, కో-సింగర్ అమృతప్రభ మహంతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ కూడా యాచ్ పార్టీలో ఉన్నారు. శేఖర్ జ్యోతి గాయకుడికి చాలా దగ్గరగా ఈత కొడుతుండగా, అమృత ప్రభ తన మొబైల్‌లో వారిని రికార్డు చేసినట్లు అంతకుముందు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. అంతకుముందు రోజే అంటే అక్టోబర్ 2వ తేదీనే జుబీన్ గార్గ్ మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, ఫెస్టివల్ మేనేజర్ శ్యామకాను మహంతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాజాగా సంధిపన్‌ను కూడా అదుపులోకి తీసుకోవడంతో ఈ కేసు మరోసారి సంచలనం రేపుతోంది. అరెస్టుకు ముందే సంధిపన్ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెడుతూ.. తాను విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు అరెస్ట్ అయింది పోలీస్ ఆఫీసర్ కావడంతో అతడి సస్పెన్షన్ గురించి కూడా అంతా ప్రశ్నిస్తున్నారు. ఈక్రమంలోనే స్పందించిన ఎస్‌ఐటీ చీఫ్, అస్సాం సీఐడీ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మున్నా గుప్తా.. అరెస్ట్ ఇప్పుడే జరిగిందని, కాబట్టి సస్పెన్షన్ లేదా ఇతర చర్యలను సంబంధిత శాఖ తీసుకుంటుందని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)