మంగళగిరి-కృష్ణా కెనాల్ స్టేషన్ల మధ్య ఆరు లేన్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జి

Telugu Lo Computer
0

ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి, కృష్ణ కెనాల్ స్టేషన్ల మధ్య E13 ఎక్స్‌టెన్షన్ రోడ్డు వద్ద రూ.112 కోట్ల అంచనా వ్యయంతో ఆరు లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదనను రైల్వే మంత్రిత్వ శాఖ ఇవాళ ఆమోదించింది. ప్రతిపాదిత ఆర్.ఓ.బి అమరావతి రాజధాని, జాతీయ రహదారి-16 ను అనుసంధానించబోతోంది. ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా రైల్వే శాఖ భరించనుందని అధికారులు తెలిపారు. E13 స్థానం కీలకమైన ప్రదేశంలో ఉండి ఎన్.ఎచ్-16 ను అమరావతి రాజధానితో కలుపుతుందని రైల్వే వర్గాలు తెలిపాయి. అలాగే మధ్యలో ఒక వైపు రైల్వే ట్రాక్ ఉందని వెల్లడించాయి. ఈ రైల్వే ట్రాక్ చెన్నై-హౌరాను విజయవాడ మీదుగా కలిపే ముఖ్యమైన రద్దీ రైల్వే లైన్ ఉంది. ప్రారంభంలో దీనిని నాలుగు లైన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జి కోసం ప్రణాళిక చేశారు. కానీ అమరావతి భవిష్యత్తు ట్రాఫిక్ ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని ఆరు లైన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఈ ప్రాజెక్టు టెండరింగ్ ప్రక్రియకు వెళ్లే ముందు డిజైన్ల ఆమోదం, సాధారణ డ్రాయింగ్‌లు వంటి ప్రాథమిక పనులు త్వరలో పూర్తవుతాయని రైల్వే శాఖ తెలిపింది. ప్రతిపాదిత రోడ్డు ఓవర్ బ్రిడ్జి ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర ప్రాంతం వైపు వెళ్లే రోడ్డు ట్రాఫిక్ సజావుగా సాగడానికి ఎంతో సహాయపడుతుందని వెల్లడించింది. ఇది రోడ్డు , రైలు వినియోగదారుల భద్రతతో పాటు ట్రాఫిక్ ను తగ్గించడానికి పనికొస్తుందని తెలిపింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)