తమిళనాడు లోని కరూర్ తొక్కిసలాట ఘటనను సీబీఐతో దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తు సైతం నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని భావించింది. దీనికోసం ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా నియమించింది. ముగ్గురు సభ్యులు ఉండే ఈ కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగీ నాయకత్వాన్ని వహిస్తారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్ సుప్రీంకోర్టును ఇదివరకే ఆశ్రయించిన విషయం తెలిసిందే. మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై ఆయన అప్పీల్ కు వెళ్లారు. పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. తొక్కిసలాటలో ప్రభుత్వం, టీవీకే పక్షాల వాదోపవాదాలను ఆలకించింది. తాజా ఉత్తర్వులను జారీ చేసింది. విచారణ సందర్భంగా బెంచ్ పలు వ్యాఖ్యలు చేసింది. ఇటువంటి ఘటనలు పౌరుల ప్రాథమిక హక్కులను ప్రభావితం చేస్తాయని పేర్కొంది. ఈ తొక్కిసలాట యావత్ దేశాన్ని కదిలించిందని, నిష్పక్షపాత విచారణకు ఆదేశించడానికి అన్ని అర్హతలు ఉన్న పిటీషన్ గా అభివర్ణించింది. ఈ సమస్యపై నిష్పక్షపాత విచారణ కోసం దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని మధ్యంతర చర్యగా ఆదేశాలు జారీ చేస్తున్నామని తెలిపింది. సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని బెంచ్ ఆదేశించింది. తమిళనాడు కేడర్‌కు చెందని ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంకుకు తగ్గకుండా ఇతర సభ్యులుగా ఎంచుకోవాలని బెంచ్ సూచించింది. ఈ కమిటీ సీబీఐ దర్యాప్తును సంపూర్ణంగా పర్యవేక్షిస్తుందని తెలిపింది. సీబీఐకి ఆదేశాలు జారీ చేయడానికి, సేకరించిన సాక్ష్యాలను సమీక్షించడానికి ఈ కమిటీకి అధికారం ఉందని తెలిపింది. సెప్టెంబర్ 27వ తేదీన తమిళనాడు కరూర్ లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో 41 మంది మరణించిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని, సమగ్ర విచారణ జరిపించాలని విజయ్ తొలుత.. మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై మద్రాస్ హైకోర్టు సానుకూలంగా స్పందించలేదు. దీంతో సుప్రీంకోర్టు గడప తొక్కారు. సిట్ తో దర్యాప్తు జరిపించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. తొక్కిసలాట ఘటనపై టీవీకేతో పాటు, తమిళనాడుకు చెందిన బీజేపీ నాయకుడు, పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు జీఎస్ మణి దాఖలు చేసిన మరో పిటిషన్‌ను కూడా కోర్టు విచారణకు స్వీకరించింది. తొక్కిసలాట ఘటన పూర్వాపరాలను వెలికి తీయడానికి సీబీఐతో విచారణ జరిపించాలని మణి తన పిటీషన్ లో సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ రెండు పిటీషన్లు కూడా న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్ వీ అంజారియాతో కూడిన ధర్మాసనం సమక్షానికిి వచ్చాయి. వీటిని ఈ ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తమిళనాడుకే చెందిన బీజేపీ నాయకురాలు ఉమా ఆనందన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఇందులోనే క్లబ్ చేయడానికి ఈ ధర్మాసనం ఒప్పుకొంది. తమిళనాడు పోలీసు అధికారులు మాత్రమే విచారణ జరిపితే నిష్పక్షపాతంగా ఉండదని ఉమా ఆనందన్ వాదించారు.
కరూర్ తొక్కిసలాట ఘటనపై రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగీ నాయకత్వాన కమిటీని నియమించిన సుప్రీంకోర్టు
October 13, 2025
0
Tags