తెలంగాణ అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వద్ద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పని చేస్తోన్న ఎన్ సుమంత్ ప్రభుత్వం విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో కాంట్రాక్ట్ ఉద్యోగి ఆయిన సుమంత్ కి గత ఏడాది డిసెంబర్ 16వ తేదీ నాటికి కాంట్రాక్ట్ గడువు ముగిసింది. అయినప్పటికీ- దీన్ని మరో ఏడాది పాటు పొడిగించారు. ఈ ఏడాది డిసెంబర్ 16 వరకు ఆయన విధుల్లో కొనసాగాల్సి ఉంది. కాలుష్య నియంత్రణ మండలి ఆయన వేతనాలు, ఇతర సౌకర్యాలను కల్పిస్తోంది. ఆయన ఓఎస్డీగా కొండా సురేఖ వద్ద చేరారు. ఆమె పేషీలో కీలక అధికారిగా ఎదిగారని, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దేవాదాయ, అటవీ మంత్రిత్వ శాఖలో బదిలీలు, పోస్టింగ్‌లను ఇప్పిస్తూ లక్షల రూపాయలను ఆర్జించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. పర్యావరణ అనుమతులకు సంబంధించిన ఫైళ్లను ఆమోదించే విషయంలో స్టోన్ క్రషర్ల నుంచీ వసూళ్లకు పాల్పడినట్లు చెబుతున్నారు. మేడారం జాతర నిధుల్లోనూ గోల్ మాల్ కు పాల్పడ్డారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. విచారణకు ఆదేశించింది. ఓఎస్డీ హోాదాలో అటవీ, కాలుష్య నియంత్రణ మండలి, దేవాదాయ మంత్రిత్వ శాఖల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలడంతో ఆయనను విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి రవి గుగులోతు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపారు.
మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ
October 15, 2025
0
Tags