హైదరాబాద్ లో సిటీ బస్సు చార్జీలను ఏకంగా ₹10 పెంచడంపై బిఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద, మధ్య తరగతి ప్రజల జేబులను గుల్ల చేయడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన మండిపడ్డారు. పెంచిన చార్జీల వల్ల ప్రయాణికుడిపై ప్రతి నెలా ₹500 అదనపు భారం పడుతుందని, బడుగు జీవులు ఎలా బ్రతకాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే విద్యార్థుల బస్ పాస్‌లు , టీ24 టికెట్ చార్జీలు పెంచారని, ఇప్పుడు కనీస చార్జీలపై కూడా 50 శాతం ధర పెంచడం అసమర్థ విధానాలకు నిదర్శనం అని కేటీఆర్ విమర్శించారు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ దివాళా తీసిందని, సంస్థను గట్టెక్కించాల్సింది పోయి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ చార్జీల పెంపుపై ప్రభుత్వం తక్షణమే పునరాలోచించాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తూ అమలు చేస్తున్న 'మహాలక్ష్మి' పథకం కారణంగా ఆర్టీసీకి ఏర్పడిన ఆర్థిక లోటును పూడ్చేందుకు ప్రభుత్వం సామాన్య ప్రయాణికుడిపైనే భారం మోపుతోందని కేటీఆర్ స్పష్టం చేశారు. "మహిళలకు ఉచితం అంటూనే, ఇతర ప్రయాణికులపై డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారు" అని ఆయన పరోక్షంగా విమర్శించారు. ఒక చేత్తో ఉచితాన్ని ఇచ్చి, మరో చేత్తో రెట్టింపు భారాన్ని మోపడం కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత విధానాలకు నిదర్శనం అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఒక చేత్తో ఉచితాలు ఇచ్చి, మరో చేత్తో రెట్టింపు భారాన్ని మోపుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం !
October 05, 2025
0
Tags