ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆదివారం నాడు పార్టీ నాయకులతో నిర్వహించిన కీలక సమావేశంలో మాట్లాడుతూ ఇకపై ప్రతి రాష్ట్రంలోనూ బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కీలక సమావేశంలో దేశంలోని పలు రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, కేరళ నాయకులు పాల్గొన్నారు. ఈ సందరభంగా మాయావతి పార్టీ నాయకులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి నుంచి బీఎస్పీ ప్రతి రాష్ట్రంలోనూ ఓ కూటమిలో చేరకుండా ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. పార్టీని బలోపేతం చేసే బాధ్యత పూర్తిగా నాయకులదేనని, ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తమ తమ రాష్ట్రాలలో బూత్, సెక్టార్ స్థాయిలలో కార్యకర్తలకు మార్గనిర్దేశం చేసి, క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచించారు పార్టీకి మద్దతు ఇచ్చే 'కేడర్ ఓటు'ను మరింత బలోపేతం చేయాలని ఢిల్లీ నుంచి వచ్చిన కార్యకర్తలకు మాయావతి ఆదేశించారు. ఈ సమావేశంలో మాయావతి మరోసారి ఈవీఎంలపై తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. "ఈవీఎంలు తొలగించండి, దేశాన్ని రక్షించండి" అనే నినాదాన్ని ఆమె గట్టిగా వినిపించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నాయకులతో సంభాషిస్తూ, తమ రాష్ట్రాల్లో ఎన్నికలకు సన్నద్ధం కావాలని మాయావతి దిశానిర్దేశం చేశారు. ఈ నిర్ణయం రాబోయే బీహార్ ఎన్నికలతో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నికలలో రాజకీయాలపై ప్రభావం చూపనుంది.
బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుంది : బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి
October 19, 2025
0
Tags