తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్-లాండసాంగ్వి మార్గంలో పిచ్చిమొక్కలే తప్ప నివాసాలు లేని చోట ఓ మహిళ పేరుతో భువన్ సర్వేలో 54 ఆస్తులున్నట్లు నమోదు చేశారు. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు కనికట్టు ప్రదర్శించడంలో కొందరు బల్దియా అధికారులు, సిబ్బంది ఆరితేరారు. భువన్ సర్వే పేరుతో ఆస్తులను మ్యాపింగ్ చేయడంలో మాయాజాలం ప్రదర్శించారు. ఓ మహిళ పేరుతో ఏకంగా 54 ఇంటి నెంబర్లు జారీ చేశారు. నిజంగానే ఆమె అన్ని ఇళ్లను కలిగి ఉందా అంటే లేదు. నివాసాలే లేని నిర్మానుష్య ప్రాంతం, అనుమతి లేని ఓ కచ్చా లేవుట్. భువన్ సర్వేలో జరిగిన అక్రమాలకు ఇదొక ఉదాహరణ. ఖానాపూర్-అనుకుంట రహదారి మూలమలుపు నుంచి లాండసాంగ్వి వైపు వెళ్లేందుకు ఓ లింక్ రోడ్డు ఉంది. మార్గంమధ్యలో పక్కన ఓ కచ్చా లేఅవుట్‌లో ప్లాట్లు చేశారు. అందులో 54 ఖాళీ ప్లాట్లలో ఇళ్లు ఉన్నట్లుగా ఓ మహిళ పేరుతో అసెస్‌మెంట్లు చేశారు. ఇంటి నెంబర్లు ఇచ్చి భువన్ సర్వేలో నమోదు చేశారు. భౌతికంగా ఉన్న ఇళ్లకే అసెస్‌మెంట్లు చేస్తారు. కానీ, సర్వేకు వెళ్లిన సిబ్బంది అక్కడ నివాసాలు లేకపోయినా ఆస్తులను మ్యాపింగ్ చేయడాన్ని బట్టి చూస్తే అక్రమార్కులతో ఏమేరకు చేతులు కలిపారో అర్థమవుతోంది. భువన్ సర్వే బాధ్యతలు అప్పగించిన సిబ్బందికి ముందుగానే శిక్షణ ఇచ్చారు. ట్యాబ్‌లో యజమానుల వివరాలు, ఆస్తులు ఏ రకానికి చెందినవి, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి. నల్లా కనెక్షన్, మరుగుదొడ్డి సదుపాయం ఉందా ? వంటి వివరాలను నమోదు చేసి, అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా చిత్రాలను తీసి జియోట్యాగింగ్ చేయాలి. అన్నీ సవ్యంగా ఉన్న ఆస్తులను మ్యాపింగ్ చేయాల్సిన సిబ్బందిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో భువన్ సర్వే దారి తప్పి అక్రమాస్తులు ఆస్తి పన్ను రికార్డుల్లో నమోదయ్యాయి. ఉన్నతాధికారులు స్పందించి లోతుగా విచారణ జరిపిస్తే అక్రమాలు మరిన్ని బయట పడతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భువన్ సర్వేలో లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు...... !
September 09, 2025
0
Tags