టెస్లా అధికారికంగా భారత విపణిలో జులై 15న ఆర్థిక రాజధాని ముంబై లో తొలి షోరూంను ప్రారంభించింది. ఆ తర్వాత ఢిల్లీలో రెండో షోరూంను కూడా లాంఛ్ చేసింది. టెస్లా తాజాగా తన తొలి కారును కస్టమర్‌కు డెలివరీ చేసింది. తెలుపు రంగు టెస్లా 'వై మోడల్' కారును మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్‌నాయక్ కొనుగోలు చేశారు. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ నుంచి తొలి కారును ఇవాళ మంత్రికి సంస్థ ప్రతినిధులు డెలివరీ చేశారు. ఈ సందర్భంగా దేశంలోనే తొలి టెస్లా కారును కొనుగోలు చేయడం పట్ల మంత్రి ప్రతాప్ సర్‌నాయక్ సంతోషం వ్యక్తం చేశారు. విద్యుత్ వాహనాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే తాను ఈ కారును కొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఎలక్ట్రిక్ కార్లలో అత్యధిక అమ్మకాలతో రికార్డు నెలకొల్పిన 'వై' మోడల్ కార్లను భారత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది టెస్లా. రియర్-వీల్ డ్రైవ్, లాంగ్-రేంజ్ ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్ కార్లను అమ్మకానికి ఉంచింది. ఇక ధర విషయానికొస్తే రియర్-వీల్ డ్రైవ్ (ఆర్‌డబ్ల్యూడీ) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు, లాంగ్-రేంజ్ ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్ ధరను రూ. 67.89 లక్షలుగా నిర్ణయించింది. రియర్-వీల్ డ్రైవ్ వెర్షన్ ఆన్-రోడ్ ధర రూ. 61.07 లక్షలుకాగా, లాంగ్-రేంజ్ వెర్షన్ ఆన్-రోడ్ ధర రూ. 69.15 లక్షలుగా ఉంది. టెస్లా అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఇందులో 18 శాతం జీఎస్టీతో సహా రూ. 50,000 అడ్మినిస్ట్రేషన్, సర్వీస్ ఫీజు కూడా ఉంటుంది. అయితే, భారత్‌లో సగటు ఎలక్ట్రిక్ కారు ధర రూ.22 లక్షలు ఉంది. టెస్లా మోడల్ వై ధర దాదాపు రూ.60 లక్షల వరకు ఉంది.
మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రికి డెలివరీ చేసిన టెస్లా
September 05, 2025
0
Tags