శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థలను నడిపే దేశాల నేతలపై వలసవాద కాలంనాటి వ్యూహాలను ప్రయోగించాలని చూడటం తగదని రష్యా అధ్యక్షుడు పుతిన్ మందలించారు. 'భాగస్వాము'లతో వ్యవహరించాల్సిన తీరు అది కాదని స్పష్టంచేశారు. చైనా ఆయుధ ప్రదర్శనను వీక్షించడానికి బీజింగ్‌కు వచ్చిన ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ''భారత్, చైనాలు రెండూ జనాభాపరంగా పెద్ద దేశాలు. వాటికి రాజకీయ వ్యవస్థలు, సొంత చట్టాలు ఉన్నాయి. శిక్షిస్తామంటూ అలాంటి పెద్ద దేశాలకు చెప్పేముందు వాటికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారనేది ఆలోచించాలి. తమ చరిత్రలో క్లిష్ట సమయాలను దాటిన అలాంటి దేశాలు ఎలా స్పందిస్తాయనేది గమనంలో తీసుకోవాలి. సార్వభౌమత్వంపై దాడికి దిగిన వలసవాదులతో దీర్ఘకాలం పోరాడిన చరిత్ర ఈ దేశాలకు ఉంది. వీటిలో ఏ దేశ నేత అయినా బలహీనంగా ఉంటే వారి రాజకీయ ప్రస్థానం ముగిసిపోతుంది. ఆ అంశం వారి వ్యవహారశైలిపై ప్రభావం చూపిస్తుంది. ఈ దేశాలు, వాటి నేతలపై ట్రంప్‌నకు ఉన్న అవగాహన సందేహమే'' అని పుతిన్ అన్నారు. ఒక మనిషి జీవితకాలం గరిష్ఠంగా ఎన్నేళ్లు ఉండవచ్చనే అంశంపై పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య కాసేపు ఆసక్తికర చర్చ నడిచింది. ఆయుధ ప్రదర్శనను వీక్షించేందుకు వెళ్తున్నప్పుడు పుతిన్, జిన్‌పింగ్‌ల మధ్య జరిగిన సంభాషణ చైనా అధికారిక మీడియా సహా పలు అంతర్జాతీయ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారమైంది. ఒకప్పుడు 70 ఏళ్లు బతకడం అత్యంత అరుదుగా అనిపించేదని, ఇప్పుడు 70 ఏళ్లలోనూ యువకుడిగా ఉండొచ్చని జిన్‌పింగ్ అన్నారు. 'సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మానవ అవయవాల మార్పిడి జరుగుతూనే ఉంటుంది. ప్రజలు ఎప్పటికీ యువకులుగానే మిగిలిపోతారు. బహుశా అమరత్వాన్ని సాధిస్తారేమో' అని పుతిన్ చెప్పినట్లు అనువాదకుడు వివరించగానే జిన్‌పింగ్ చిరునవ్వులు చిందించారు. ప్రజలు 150 ఏళ్లు జీవించే రోజులు ఈ శతాబ్దంలోనే వస్తాయేమోనని అన్నారు. చైనా పర్యటనలో భారత ప్రధాని మోడీ, తాను కలిసి కారులో మాట్లాడుకున్నదానిలో రహస్యమేమీ లేదని విలేకరులకు పుతిన్ స్పష్టంచేశారు. 'అదేం పెద్ద రహస్యం కాదు. అలాస్కాలో ట్రంప్‌తో జరిగిన చర్చల గురించి మోడీకి వివరించాను' అని చెప్పారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించే అంశంపై చర్చించుకున్నప్పుడు ట్రంప్‌తో తాను కారులో ఏం మాట్లాడిందీ కూడా వెల్లడించారు. 'ట్రంప్‌తో 30 సెకన్లే మాట్లాడుకున్నాం. ఆయన ఆరోగ్యంగా ఉండటం చూసి సంతోషంగా అనిపించిందని చెప్పాను' అని తెలిపారు.
వలసవాద కాలంనాటి వ్యూహాలను ప్రయోగించాలని చూడటం తగదు!
September 05, 2025
0
Tags