ఇన్నాళ్లూ మీరు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టింది చాలు - ఇక స్వదేశానికి తిరిగిరండి !

Telugu Lo Computer
0


మెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రముఖ టెక్నాలజీ సంస్థల అధిపతులు, సీఈవోలకు విందు ఇచ్చారు. వైట్‌హౌస్‌లో ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ ఆధ్వర్యంలో జరిగిన ఏఐ ఈవెంట్‌ అనంతరం ఈ డిన్నర్‌ ఏర్పాటు చేశారు. దీనికి టిమ్‌కుక్‌, సుందర్‌ పిచాయ్‌, జుకర్‌బర్గ్‌, సత్యనాదెళ్ల వంటి పలువురు టెక్‌ దిగ్గజాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికాలో పెట్టుబడుల గురించి ట్రంప్‌ వారిని సూటిగా ప్రశ్నించారు. ''టిమ్‌.. అమెరికాలో యాపిల్ ఎంత పెట్టుబడులు పెట్టనుంది. అది చాలా పెద్ద మొత్తమే అయి ఉంటుందని నాకు తెలుసు. ఇన్నాళ్లూ మీరు బయట (ఇతర దేశాల్లో) పెట్టుబడులు పెట్టింది చాలు. ఇక స్వదేశానికి తిరిగిరండి. ఎంత పెట్టుబడి పెడతారు?'' అని యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ను ట్రంప్‌ అడిగారు. దీనికి టిమ్‌ బదులిస్తూ '600 బిలియన్‌ డాలర్లు' అని చెప్పారు. ఆ వెంటనే మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ను ట్రంప్‌ అడగ్గా '600 బిలియన్‌ డాలర్లు' అని చెప్పారు. 'రాబోయే రెండేళ్లలో 250 బిలియన్‌ డాలర్లు అమెరికాలో పెట్టుబడులు పెట్టబోతున్నాం' అని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. 'ఏటా 80 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేస్తాం' అని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల బదులిచ్చారు. దీంతో ట్రంప్‌ హర్షం వ్యక్తం చేశారు. ''ఇది చాలా పెద్ద మొత్తం. అనేక ఉద్యోగాలు సృష్టించొచ్చు. ధన్యవాదాలు'' అని టెక్‌ దిగ్గజాలను మెచ్చుకున్నారు. ఈ విందుకు టెస్లా అధినేత, అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు ఆహ్వానం అందకపోవడం గమనార్హం. అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత కొంతకాలం పాటు ట్రంప్‌ వెంటే మస్క్‌ కన్పించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో ఆయన డోజ్‌ శాఖ బాధ్యతలను కూడా చేపట్టారు. అయితే, ఆ తర్వాత వీరి మధ్య విభేదాలు రావడంతో బహిరంగంగానే పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టెస్లా అధినేతను అధ్యక్షుడు ఆహ్వానించకపోవడం గమనార్హం. కాగా.. మస్క్‌ స్థానంలో ఆయన ప్రత్యర్థి, ఓపెన్‌ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌కు ఆతిథ్యమివ్వడం చర్చనీయాంశమైంది. ఈ విందులో జుకర్‌బర్గ్‌ - ట్రంప్‌ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఈ డిన్నర్‌కు వస్తుండగా ఓ విలేకరి మెటా అధినేతతో మాట్లాడారు. బ్రిటన్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించి మీరు ఆందోళన చెందుతున్నారా? అని అడిగారు. దీనికి సమాధానం చెప్పేందుకు జుకర్‌బర్గ్‌ నిరాకరించారు. ఈ విషయం తెలుసుకున్న ట్రంప్‌ 'మీ రాజకీయ కెరీర్‌కు ఇదే ఆరంభం' అని అన్నారు. అందుకు మెటా అధినేత స్పందిస్తూ.. 'కాదు కాదు' అని అనడంతో అక్కడున్న వారంతా నవ్వులు చిందించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)