భార్యకు ఆదాయం అధికంగా ఉంటే భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని మద్రాసు హైకోర్టు పేర్కొంది. భరణం ఇవ్వాలని ఆదేశించిన ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేసింది. చెన్నైకి చెందిన వైద్య దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు కోరుతూ చెన్నై ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారు. విచారణ జరిపిన కోర్టు భర్త తన భార్యకు నెలకు రూ.30 వేలు భరణంగా ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ వైద్యుడు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ బాలాజీ బుధవారం జారీచేసిన ఉత్తర్వుల్లో వారి కుమారుడు నీట్ కోసం సిద్ధమవుతున్నాడని, అతని చదువుకయ్యే ఖర్చుగా రూ.2.77 లక్షలు ఇవ్వడానికి పిటిషనర్ అంగీకరించారన్నారు. అదే సమయంలో పిటిషనర్ భార్యకు అధికంగా ఆస్తులు, ఆదాయం ఉన్నాయని, ఆమె స్కానింగ్ సెంటర్ నడుపుతున్నట్లు తెలుపుతూ సంబంధిత పత్రాలను దాఖలు చేశారని తెలిపారు. కాబట్టి పిటిషనర్ తన భార్యకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కుమారుడి చదువుకు డబ్బులు ఇచ్చే విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోదంటూ ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేశారు.
భార్యకు ఆదాయం అధికంగా ఉంటే భరణం ఇవ్వక్కర్లేదు !
September 05, 2025
0
Tags