ఇరాన్ వ్యూహాత్మక ఓడరేవు విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఓడరేవులో కార్యకలాపాల కోసం 2018లో మంజూరు చేసిన ఆంక్షల మినహాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్‌లోని చాబహార్ పోర్టు వ్యూహాత్మకంగా, వాణిజ్యపరంగా భారత్‌కు ఎంతో కీలకమైంది. గతేడాది భారత్ ఈ పోర్టు నిర్వహణ కోసం ఇరాన్‌తో పదేళ్ల ఒప్పందం చేసుకుని, పోర్టు అభివృద్ధి కోసం బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌ను ఇబ్బంది పెట్టేదిగా ఉంది. ట్రంప్ సర్కారు ఈ పోర్టుకు గతంలో ఇచ్చిన ఆంక్షల మినహాయింపును రద్దు చేయడంతో ఇండియాకు కొత్త సవాళ్లు ఎదురయ్యాయి. సెప్టెంబర్ 29, 2025 నుంచి అమల్లోకి వచ్చే ఈ నిర్ణయం ఇరాన్‌పై మరింత ఒత్తిడిని పెంచేదిగా ఉంది. సెప్టెంబర్ 29, 2025న అమెరికా ఆంక్షలు అమల్లోకి రానుండగా.. ఈ నిర్ణయం భారత్‌కు ఆర్థికంగా , వ్యూహాత్మకంగా తీవ్ర సవాళ్లను సృష్టిస్తుంది. చాబహార్ పోర్టు భారతదేశానికి అఫ్గానిస్తాన్, మధ్య ఆసియాకు ఓ ప్రవేశ ద్వారం లాంటిది. పాకిస్తాన్‌ను దాటవేసి వాణిజ్యం నిర్వహించడానికి ఇది ఓ ముఖ్యమైన మార్గం. ఇప్పుడు ఆంక్షల కారణంగా ఈ మార్గం మూసుకుపోయి భారత్ ప్రాంతీయ అనుసంధానంపై తీవ్ర ప్రభావం పడుతుంది. చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ లో భాగమైన పాకిస్తాన్ గ్వాదర్ పోర్టుకు పోటీగా చాబహార్ పోర్టును భారత్ అభివృద్ధి చేస్తోంది. చాబహార్ ప్రాజెక్ట్ ఆగిపోతే చైనా, పాకిస్తాన్ తమ ప్రాంతీయ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయి. దీనిని భారత్ కు శిక్షాత్మక చర్యగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. చాబహార్ పోర్టులో భారత్ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ ద్వారా 120 మిలియన్ డాలర్ల పెట్టుబడితో పాటు 250 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించింది. ఆంక్షల కారణంగా ఈ పెట్టుబడులు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. ప్రాజెక్టు కార్యకలాపాల్లో పాల్గొనే భారతీయ సంస్థలు అమెరికా ఆంక్షల పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. చాబహార్ పోర్టు అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ లో ఒక కీలక భాగం. ఈ కారిడార్ భారత్, ఇరాన్, రష్యా, యూరప్ మధ్య సరుకుల రవాణాను సులభతరం చేస్తుంది. ఆంక్షల వల్ల ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి ఆలస్యమై, భారత్‌కు భారీ ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి. ఇరాన్‌తో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ ఆంక్షల కారణంగా భారత్ ఈ ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గితే ఇరాన్ తో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది.
చాబహార్ పోర్టు ఆంక్షల మినహాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన అమెరికా : భారత్‌ను ఇబ్బంది పెట్టే నిర్ణయం !
September 19, 2025
0
Tags