ఢిల్లీలో మీడియాతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ పలు విషయాలు ప్రస్తావించారు. పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియమాలు ఏవీ స్పష్టంగా లేవని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంపై భారత రాష్ట్ర సమితి నేతలకే స్పష్టత లేదు. ఆ పార్టీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అసెంబ్లీలో హరీశ్ రావు అన్నారు. 37 మంది కాదని కేటీఆర్ ఇంకో సంఖ్య చెప్తున్నారు. ఇంటికొచ్చిన వాళ్లకు కండువా వేస్తే పార్టీ మారినట్లు అవుతుందా..?' అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. ''బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి మూడు బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే గడువు అంశం సుప్రీంకోర్టులో ఉంది. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్తుందో వేచి చూస్తున్నాం. న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మళ్లీ కోర్టుకు వెళ్లాలా? వద్దా? అనేది అప్పుడే నిర్ణయం తీసుకుంటాం'' అని సీఎం తెలిపారు. కవిత వ్యవహారం అంతా కుటుంబం, ఆస్తి పంపకాల వివాదమేనని సీఎం వ్యాఖ్యానించారు. ''ఒక ఆడబిడ్డపై నలుగురు కలిసి దాడి చేస్తున్నారు. కుటుంబ వ్యవహారంతో సామాన్య ప్రజలకు ఏం సంబంధం? కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు సామాజికంగా బహిష్కరించారు. 2014-19 మధ్య కేసీఆర్ కేబినెట్‌లో ఒక్క మహిళ కూడా లేరు. ఉద్యమం పేరుతో ఆయన కొన్ని వందల మంది పిల్లల ఉసురు పోసుకున్నారు.. అది ఊరికే పోదు. హైదరాబాద్ మెట్రో విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేటీఆర్ కలిసి అడ్డంకులు సృష్టిస్తున్నారు. 'ఎల్ అండ్ టీ'తో ఒప్పందం చేసుకుంటేనే అనుమతులు ఇస్తామని కేంద్రం చెబుతోంది. కేంద్రంలో ఉన్న కిషన్‌రెడ్డి ఇలాంటి మెలికలు పెడుతున్నారు. కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పదే పదే డిమాండ్ చేశారు. అలా చేస్తే 48 గంటల్లోనే ఈ కేసు విచారణ చేపట్టేలా చూస్తానని అన్నారు. సీబీఐకి ఇచ్చి ఇన్ని రోజులైంది.. కిషన్‌రెడ్డి ఎక్కడా మాట్లాడటం లేదు. సీబీఐ దర్యాప్తును ఆపాలని కేటీఆర్ చెప్పారు కాబట్టే, కిషన్‌రెడ్డి అమలు చేశారు. కేటీఆర్, కిషన్‌రెడ్డి మధ్య అంతటి అవినాభావ సంబంధం ఉంది'' అని సీఎం అన్నారు.
పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియమాలు ఏవీ స్పష్టంగా లేవు !
September 19, 2025
0
Tags