నీటిని సమర్థంగా నిర్వహిస్తే కరవు అనే మాట రాదు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లో నీటిని సమర్థంగా నిర్వహిస్తే కరవు అనే మాట రాదని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఎక్కడికక్కడ భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సరైన వినియోగంతో రాష్ట్రంలో 700 టీఎంసీల మేర భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. పదేళ్లలో 439 టీఎంసీలు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చినట్లు తెలిపారు. డిసెంబరు 25 నాటికి పోలవలం డయాఫ్రమ్‌ వాల్‌ పూర్తి చేస్తామని వెల్లడించారు. కుప్పం ప్రాంతానికి నీళ్లు తరలించి జలహారతి ఇవ్వడంతో తన జన్మ సార్థకమైందన్నారు. పోలవరం నిర్మాణంలో సమస్యలు అధిగమిస్తూ వచ్చాం. గత పాలనలో ప్రాజెక్టు డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోయింది. దీనికి మళ్లీ రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసే పరిస్థితి ఏర్పడింది. డిసెంబరు 25 నాటికి పోలవలం డయాఫ్రమ్‌ వాల్‌ పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా వంశధార వరకు నీళ్లు తరలించవచ్చు. రూ.960 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు 75 శాతం పూర్తయ్యాయి. అక్టోబరులోనే అనకాపల్లి వరకు ఈ జలాలు తీసుకొస్తాం. రూ.1425 కోట్లతో ఈ ప్రాజెక్టును పోలవరం కుడి కాలువతో అనుసంధానించాం. శ్రీశైలంలో నిల్వ చేసిన నీళ్లు సీమ, హంద్రీనీవా, గాలేరు-నగరికి; మల్యాల నుంచి కుప్పం ప్రాంతానికి హంద్రీనీవా జలాలు తరలించాం. పులివెందులలోని చెరువులకూ నీళ్లందించాం. హంద్రీనీవా ప్రాజెక్టుపై ఇప్పటివరకు రూ.13 వేల కోట్లు ఖర్చు చేశాం. దీని ద్వారా 40 టీఎంసీల నీళ్లు తరలించగల్గుతున్నాం. హంద్రీనీవా మార్గంలో 6 రిజర్వాయర్లు పూర్తి చేశాం. తుంగభద్ర ప్రాజెక్టులో దెబ్బతిన్న 33 గేట్ల మరమ్మతులు చేశాం. శ్రీశైలం స్పిల్‌వే రక్షణకు రూ.204 కోట్లతో టెండర్లు పిలిచాం. త్వరలో పూర్తిచేస్తాం. సోమశిల ప్రాజెక్టు మరమ్మతులు వచ్చే సీజన్‌కల్లా పూర్తి చేస్తాం. గత పాలనలో చిత్తూరు జిల్లాలో ప్రీ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లు చేపట్టారు. వైకాపా వర్గీయుల కోసం రూ.2,144 కోట్లతో ప్రాజెక్టు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించడంతో ఎన్‌జీటీ సుప్రీం కోర్టుకు వెళ్లింది. పనులు నిలిపివేయించిన కోర్టు.. రూ.100 కోట్లు ఫైన్‌ వేసి, రూ.25 కోట్లు కట్టాలని చెప్పింది. వైకాపా నేతలు చేసిన తప్పులకు ప్రభుత్వం రూ.25 కోట్లు జరిమానా కట్టిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)