కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని ఔరద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండప్ప వకీల్‌కు ఆగస్టు 12న సీబీఐ అధికారినంటూ ఓ ఫోన్‌కాల్ వచ్చింది. మనీలాండరింగ్ కేసులో ఓ నిందితుడిని అరెస్టు చేయగా అతడి వద్ద మాజీ ఎమ్మెల్యే బ్యాంకు అకౌంట్ వివరాలు, ఏటీఎం కార్డు దొరికాయని చెప్పాడు. ఏ క్షణంలోనైనా అరెస్టు చేయవచ్చంటూ వకీల్‌ను హెచ్చరించాడు. కాసేపటికి మరో వ్యక్తి ఫోన్ చేసి దర్యాప్తు అధికారినంటూ వకీల్‌ను సంప్రదించాడు. ఆయన వ్యక్తిగత, ఆస్తి వివరాలు తీసుకున్నాడు. అనంతరం వకీల్‌ను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పాడు. మరుసటి రోజు వకీల్‌కు వీడియో కాల్ చేసి ఆన్‌లైన్‌లో నకిలీ కోర్టును, న్యాయమూర్తిగా ఒకరిని చూపించి నమ్మించారు. నకిలీ న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి వకీల్ నిర్దోషిగా పేర్కొంటూ ఓ ఒప్పందంపై సంతకం చేయాలని ఆదేశించాడు. ఆ తతంగం తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ కింద ఆర్‌టీజీఎస్ ద్వారా రూ.10 లక్షలు బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలని ఆదేశించాడు. దర్యాప్తు తర్వాత ఇచ్చిన సొమ్ము తిరిగి వస్తుందని హామీ ఇచ్చాడు. దాదాపు ఎనిమిది రోజులు వకీల్‌ను డిజిటల్ అరెస్ట్ చేశారు. సైబర్ నేరగాళ్లు ఆయన నుంచి రూ. 30.99 లక్షలను పలు దఫాలుగా బదిలీ చేయించుకున్నారు. ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన మాజీ ఎమ్మెల్యే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కర్ణాటక మాజీ ఎమ్మెల్యే గుండప్ప వకీల్‌ను డిజిటల్ అరెస్ట్ చేసిన కేటుగాళ్లు !
September 09, 2025
0
Tags