అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో విలేకరులతో మాట్లాడుతూ భారత్ ఇన్ని సంవత్సరాల పాటు అధిక టారిఫ్ ను విధిస్తూ రావడం వల్ల అమెరికన్ కంపెనీలకు అక్కడ వ్యాపారం చేయడం కష్టతరమౌతోందని పేర్కొన్నారు. అదే సమయంలో భారతీయ వస్తువులు మాత్రం తమ దేశ మార్కెట్ లోకి స్వేచ్ఛగా వస్తున్నాయని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. హార్లే-డేవిడ్ సన్ బైక్ అమ్మకాలను ఆయన ఇందుకు ఉదహరించారు. హార్లీ డేవిడ్ సన్ సంస్థ తమ బైక్ భారత్ ఎగుమతులపై 200 శాతం టారిఫ్ ను ఎదుర్కొందని డొనాల్డ్ ట్రంప్ వివరించారు. దీన్ని నివారించడానికి ఆ కంపెనీ చివరికి భారత్ లో ప్రత్యేకంగా ఓ బైక్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. తన ప్రభుత్వం అమలు చేస్తున్న టారిఫ్ విధానాల వల్ల కార్ల తయారీదారులు సహా అన్ని రంగాలకు చెందిన మాన్యుఫ్యాక్చరర్లు అమెరికాలో ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తోన్నారని ట్రంప్ పేర్కన్నారు. భారత్ తో అన్ని రకాలుగా సత్సంబంధాలు ఉన్నాయని ట్రంప్ పునరుద్ఘాటించారు. ద్వైపాక్షిక, విదేశాంగ, ఆర్థిక, వాణిజ్య రంగాల్లో ఇరు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉందని ప్రశంసించారు. టారిఫ్ లకు మాత్రం ఇది వర్తించదని, చాలా సంవత్సరాలుగా ఏకపక్షంగా కొనసాగుతూ వచ్చిందని వ్యాఖ్యానించారు. కొన్ని సంవత్సరాలుగా తాము భారత్ తో పెద్దగా వ్యాపారం చేయట్లేదని, భారీగా టారిఫ్ విధించకపోవడం వల్ల ఆ దేశం తమతో వాణిజ్య సంబంధాలను కొనసాగించిందని వివరించారు. భారత్ లో తయారైన ప్రతి వస్తువును భారీ పరిమాణంలో అమెరికాకు పంపుతున్నారని, దీనివల్ల ఆ వస్తువు అమెరికాలో తయారు కావట్లేదని అన్నారు. ఫలితంగా పారిశ్రామికంగా, ఉద్యోగాలపరంగా కొంత మేర నష్టపోవాల్సి వచ్చిందని ట్రంప్ విశ్లేషించారు. టారిఫ్ పెంచిన తర్వాత అమెరికాలో పెట్టుబడులు పెట్టడానికి చైనా, మెక్సికో, కెనడా నుండి అనేక కార్ల కంపెనీలు ముందుకు వస్తోన్నాయని వివరించారు.
అమెరికా కంపెనీలు భారత్ లో వ్యాపారం చేయడం కష్టతరమౌతుంది : డొనాల్డ్ ట్రంప్
September 03, 2025
0
Tags