ఈ నెల 6న కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ నేత అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. ఈ మేరకు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆయనను ఈ వేడుకలకు ఆహ్వానించింది. దీనికి అమిత్ షా అంగీకరించారని తెలిసింది. దీంతో అమిత్ షా నిమజ్జన శోభా యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని తొలుత ఐటీసీ కాకతీయలో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు చార్మినార్ వద్ద వినాయక శోభాయాత్రలో పాల్గొంటారు. మధ్యాహ్నం మూడున్నరకు ఎంజే మార్కెట్ వద్ద శోభాయాత్రలో ప్రసంగిస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. కాగా అమిత్ షా రాక సందర్భంగా నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అయితే చంద్రగ్రహణం కారణంగా నిమజ్జనం కార్యక్రమంపై అనేక సందేహాలు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలోగణేష్ ఉత్సవ కమిటీ దీనికి స్పష్టతనిస్తూ శనివారం రోజునే నిమజ్జనం చేయాలని ప్రకటన జారీ చేసింది. ట్యాంక్ బండ్ వద్ద రెండో రోజునుంచే నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది.ఈ వినాయక నిమజ్జన వేడుకలు ప్రత్యక్షంగా చూసేందుకు భారీ ఎత్తున జనాలు తరలి వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ ప్రాంతంలో పెద్దసంఖ్యలో క్రేన్లను ఏర్పాటు చేశారు. భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులు ప్రత్యేక సిబ్బందిని మొహరించారు. ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేసారు. రూ. 30 కోట్లతో గణేశ్ నిమజ్జనోత్సవాలు ఏర్పాట్లు చేస్తున్న జీహెచ్ఎంసీ గ్రేటర్ పరిధిలో 74 పాండ్స్ తో పాటు పలు చెరువుల్లో నిమజ్జనాలకు ఏర్పాట్లు చేసారు. వీటిలో 27 పర్మినెంట్ బేబీ పాండ్స్.. 24 టెంపరరీ పోర్టబుల్ పాండ్స్ ఉన్నాయి. ఈసారి శోభాయాత్రలో అమిత్ షా పాల్గొన నుండటంతో శోభాయాత్ర జరిగే మార్గాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే, అమిత్ షా పర్యటన రోజున మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలున్నాయి. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ మళ్లింపు పైన పోలీసులు స్పష్టత ఇచ్చారు. మెట్రో అదనపు సర్వీసులు నడపనున్నారు.
భాగ్యనగర్ గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు అమిత్ షా
September 03, 2025
0
Tags