జీఎస్టీ కొత్త రేట్లు అమలై ధరలు తగ్గిన తర్వాత కొనుగోలు చేయాలని కస్టమర్లు వేచి చూస్తున్నారు. అప్పటి వరకు ఆగి కొందామనే ధోరణిలోనే ఉన్నారు. దీంతో చాలా వరకు ట్రాన్సాక్షన్లు ఆగిపోయాయి. ఈ క్రమంలోనే బ్యాంకుల్లో కార్ల రుణాలు రద్దవుతుండడం గమనార్హం. కొత్త కారు కొనుగోలు కోసం లోన్ తీసుకునేందుకు అప్లై చేసుకున్న వారు తీరా బ్యాంకులు ఆమోదించాక ఇప్పుడు వద్దంటున్నారు. ప్రస్తుతానికి తమకు లోన్ అక్కర్లేదంటూ అభ్యర్థనలు ఇస్తున్నట్లు బ్యాంకులు పేర్కొంటున్నాయి. కార్ల ధరపై జీఎస్టీని కేంద్రం తగ్గించింది. ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి రానున్నాయి. వాహనాల ధరలు తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన క్రమంలో కొనుగోలుదారులు అప్పటి వరకు ఆగాలని నిర్ణయించుకుంటున్నారు. ఉదాహరణకు ఒక కస్టమర్ కొనుగోలు చేయాలని చూస్తోన్న కారు ధర రూ.10 లక్షలు ఉందనుకుందాం. రూ. 8 లక్షల వరకు బ్యాంకులో లోన్ తీసుకోవాలనుకున్నాడు. బ్యాంకును సంప్రదించి లోన్ అప్లై చేసుకున్నాడు. బ్యాంక్ లోన్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. అయితే సెప్టెంబర్ 22వ తేదీ తర్వాత రూ.10 లక్షల కారు ధర దాదాపు రూ.లక్ష వరకు తగ్గుతుంది. అప్పుడు లోన్ తీసుకునే అవసరం తగ్గుతుంది. అతడికి రూ.7 లక్షల లోన్ సరిపోతుంది. అందుకే ఇప్పటికే ఆమోదం పొందిన రుణాలను కస్టమర్లు రద్దు చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 22వ తేదీన తర్వాతనే కారు లోన్ తీసుకుని కొనుగోలు చేయాలని భావిస్తున్నారు.
జీఎస్టీ కొత్త రేట్లు అమలు తర్వాత కార్లను కొనుగోలు చేయాలని భావిస్తున్న కస్టమర్లు !
September 15, 2025
0
Tags