విశాఖ పట్నంలో ఆత్మహత్య చేసుకున్న వైద్య విద్యార్థులు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నంలో బుధవారం వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వైద్య విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. రుషికొండలోని గీతం కళాశాల విద్యార్థి, తగరపువలసలోని ఎన్‌ఆర్‌ఐ కళాశాల విద్యార్థిని భవనాల పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. పీఎంపాలెం సీఐ జి.బాలకృష్ణ, పెందుర్తి ఎస్‌ఐ భాస్కరరావు తెలిపిన వివరాల మేరకు హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం చంబా జిల్లాలోని తెహిసిల్‌ చంబా గ్రామానికి చెందిన విస్మాద్‌ సింగ్‌ (20) గీతం వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. తోటి విద్యార్థులతో ఎంతో కలివిడిగా ఉండేవాడు. బుధవారం ఉదయం కళాశాలలోని ఆరో అంతస్తుకు చేరుకుని మెట్ల మార్గం మధ్య నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి కుల్విందర్‌పాల్‌ సింగ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 'ఈ లోకంలో నేను బతకలేను. ముందూ వెనకా బురదే. నదీప్రవాహం ఎంత బలంగా ఉన్నా ఎక్కడో ఓ చోట ఆగిపోతోంది. నేను ఆ దారిలో మునిగిపోతాను. నాకు మరో జన్మ వద్దు' అని రాసిన సూసైడ్‌ నోట్‌ను మృతుడి గదిలో స్వాధీనం చేసుకున్నారు. అలాగే అనకాపల్లి జిల్లా మాకవరపాలేనికి చెందిన చింతల దేముడు టాంజానియాలో పొక్లెయిన్‌ ఆపరేటర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయన కుమార్తె శివానీ జోత్స్న (21) తగరపువలస ఎన్‌ఆర్‌ఐ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మొదటి సంవత్సరంలో పలు సబ్జెక్టులు ఫెయిలైంది. ఆ పరీక్షలు తిరిగి రాయడానికి తల్లి గౌరితో కలిసి రెండు రోజుల కిందట విశాఖలోని మేనమామ ఇంటికి వచ్చింది. బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో వాకింగ్‌ కోసమంటూ మేడపైకి వెళ్లి ఐదో అంతస్తు పైనుంచి దూకేసింది. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను సమీపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)