ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ టోర్నీ ఫైనల్‌లో భారత జావెలిన్ నీరజ్ చోప్రా టైటిల్‌ను నిలబెట్టుకోలేకపోయాడు. 12మంది పోటీపడగా నీరజ్ ఒక్కసారి కూడా 85 మీటర్ల మార్కు అందుకోలేకపోయాడు. ఉత్తమంగా 84.03 మీటర్లు విసిరి ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యాడు. మూడు, ఐదో ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్ రెండో ప్రయత్నంలో 84.03 మీటర్లు విసిరాడు. అయితే, ఈ ఫైనల్‌లో పోటీపడిన మరో భారత అథ్లెట్ సచిన్ యాదవ్ అంచనాలకు మించి రాణించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అతను ఉత్తమంగా 86.27 మీటర్ల త్రో విసిరి మొత్తంమీద నాలుగో స్థానంలో నిలిచాడు. సచిన్ 40 సెంటీ మీటర్ల తేడాతో కాంస్య పతకం చేజార్చుకున్నాడు. 86.67 మీటర్లతో మూడో స్థానంలో నిలిచిన అమెరికా అథ్లెట్ థాంప్సన్ కాంస్య పతకం అందుకున్నాడు. కెషోర్న్ వాల్కాట్ (ట్రినిడాడ్ అండ్ టుబాగో, 88.16 మీ) స్వర్ణం గెలవగా, అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా, 87.38 మీ) రజతం సాధించాడు. నీరజ్ తొలి ప్రయత్నంలో 83.65 మీటర్ల దూరం విసరగా.. సచిన్ యాదవ్ ఏకంగా 86.27 మీటర్ల దూరం విసిరాడు. రెండో ప్రయత్నంలో నీరజ్ (83.65 మీ), సచిన్ ఫౌల్ చేశాడు. మూడో ప్రయత్నంలో నీరజ్ ఫౌల్ చేయగా.. సచిన్ (85.71 మీ) విసిరాడు. నాలుగో ప్రయత్నంలో సచిన్ (84.90 మీ), నీరజ్ (82.86 మీ) త్రో విసిరారు. ఐదో ప్రయత్నంలో ఫౌల్ చేయడంతో నీరజ్ ఎనిమిదో స్థానానికి పరిమితమై పతక రేసు నుంచి వైదొలిగాడు. సచిన్ యాదవ్ ఐదో ప్రయత్నంలో (85.96 మీ) విసిరి పతకం ఆశలు కలిగించినా.. చివరి ప్రయత్నంలో 80.95 మీటర్ల దూరమే త్రో విసిరాడు. పారిస్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ కూడా ఈ ఫైనల్‌లో తేలిపోయాడు. రెండు, నాలుగు ప్రయత్నాల్లో ఫౌల్ చేసిన అతను ఉత్తమంగా 82.75 మీటర్ల త్రోతో పదో స్థానంలో నిలిచాడు.
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో సచిన్ యాదవ్‌కు నాలుగో స్థానం - నీరజ్ చోప్రాకు ఎనిమిదో స్థానం
September 18, 2025
0
Tags