జీఎస్టీలో సంస్కరణలకు మద్దతు తెలిపినందుకు అన్ని రాష్ట్రాలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు లేఖ రాసినట్లు చెప్పారు. పన్ను రేట్లను సవరించాలనే దానిపై రాష్ట్రాలు అభిప్రాయాలు చెప్పినప్పటికీ.. అవన్నీ సామాన్యుడికి ప్రయోజనం కలిగించేవేనని అన్నారు. పీటీఐతో మాట్లాడిన ఆమె జీఎస్టీ కౌన్సిల్‌లో తీసుకున్న నిర్ణయాలు దేశ ప్రజలకు ఎంతో దోహదపడతాయన్నారు. ''జీఎస్టీ రేట్లలో మార్పునకు మద్దతు తెలియజేసినందుకు ప్రతి ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు తెలియజేశా. ఎన్ని తీవ్రమైన చర్చలు, వాదనలైనా చేయవచ్చు. చివరకు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలతో దేశ ప్రజలకు ఉపశమనం కలిగింది. ఇందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ లేఖ రాశా'' అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సామాన్యులకు ప్రయోజనం చేకూర్చే సవరణలే ఉన్నాయని, వీటికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశమే లేదన్నారు. దేశ ప్రయోజనాల కోసం అందరూ ఒక్కతాటిపైకి రావడం సంతోషకర విషయమన్నారు. రేట్ల తగ్గింపుపై రాష్ట్రాలు ఎప్పుడూ అనుకూలంగానే ఉంటాయని, అయితే, వారి ఆందోళనంతా రాబడిలో కోతపైనే ఉంటుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ''తాజా తగ్గింపుతో రాష్ట్రాలకే కాకుండా కేంద్రం కూడా ఆదాయం కోల్పోతుందన్న విషయం వారికి చెప్పాను. రేట్లు తగ్గితే ప్రజలు కొనుగోలు చేస్తారు. తద్వారా కోల్పోయిన ఆదాయాన్ని ప్రభుత్వాలు భర్తీ చేసుకోవచ్చు. ఈ విషయంతోనే ఏకాభిప్రాయం కుదిరింది'' అని కేంద్ర మంత్రి వివరించారు. ఇదిలాఉంటే, ఇటీవల తీసుకున్న జీఎస్‌టీ కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్న విషయం తెలిసిందే.
జీఎస్టీకి మద్దతు తెలిపిన రాష్ట్రాలకు ధన్యవాదాలు తెలుపుతూ నిర్మలా సీతారామన్ లేఖ
September 06, 2025
0
Tags