దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణకు ఎన్నిక సంఘం సిద్దమవుతోంది. ఓవైపు 2029 లోపు జమిలి ఎన్నికలు అసాధ్యమని తేల్చేస్తున్నా మరోవైపు దేశవ్యాప్తంగా ఒకేసారి ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ చేపట్టేందుకు ఈసీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇవాళ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులతో ఆన్ లైన్ లో భేటీ అయిన సీఈసీ, ఈ దిశగా చర్చలు జరిపారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఓటర్ల జాబితాల సవరణ చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్నికల అధికారులతో చర్చించారు. అయితే ఎప్పటిలోగా ఈ ప్రక్రియ చేపడతారన్న దానిపై మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ బీహార్ ఎన్నికలు ముగియగానే దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ చేపట్టేందుకు ఈసీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీహార్ లో చేపట్టిన ఎస్ఐఆర్ తీవ్ర వివాదాస్పదం కావడంతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఇందులో ఆధార్ కార్డును ఓటరు గుర్తింపుకు పరిగణనలోకి తీసుకోకపోవడం, ఆ తర్వాత సుప్రీం ఆదేశాలతో 12వ గుర్తింపు కార్డుగా దీన్ని జాబితాలో చేర్చడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల సవరణ ప్రారంభిస్తే ఇలాంటి మరిన్ని సమస్యలు బయటపడటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే దేశంలో ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా మార్చేందుకు వీలుగా ఇలాంటి భారీ కసరత్తు చేపట్టక తప్పదని ఈసీ భావిస్తోంది. అసలే రాహుల్ గాంధీ కర్నాటక, మహారాష్ట్రలో ఓటరు జాబితాల్లో లోపాల్ని బయటపెట్టిన తర్వాత ఈసీ ప్రతిష్ఠ మనసబారుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చేపట్టే ఓటర్ల జాబితాల సవరణలో ఏదైనా తేడా వస్తే దాని ప్రభావం కేంద్రంలో అధికార బీజేపీపై కచ్చితంగా పడడం ఖాయంగా కనిపిస్తోంది.
దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణకు సిద్ధమవుతున్న ఎన్నికల సంఘం ?
September 10, 2025
0
Tags