అమెరికాలో 1.74 లక్షల టెస్లా కార్లపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ అయ్యాయి. టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు ఈ పరిణామం కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. అయితే ప్రస్తుతం మార్కెట్లో అత్యాధునిక ఫీచర్లు ఉన్న కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. అలాంటి ఫీచర్లు ఉన్న కార్లను తయారు చేసే కంపెనీల్లో టెస్లా కూడా ఒకటి. అమెరికాలో టెస్లా మోడల్ వై కారు ధర సుమారు రూ.39.5 లక్షలయితే ఇప్పుడు ఈ మోడల్‌కు భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఆ కారు మోడల్ పై దర్యాప్తు మొదలైంది. టెస్లా తన మోడల్ వై కారును ఎక్కువ స్థలం, సౌకర్యవంతమైన సీట్లు, అద్భుతమైన భద్రతా ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. కానీ కారు డోరు తెరుచుకోకపోతే అది కూడా లోపల పిల్లలు చిక్కుకుపోయినప్పుడు ఆ భద్రతపై ప్రశ్నలు తలెత్తడం సహజమే. అమెరికాలో కొంతమంది టెస్లా మోడల్ వై యజమానులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. తల్లిదండ్రులు కారు డోర్ తెరవడానికి ఎంత ప్రయత్నించినా కుదరలేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో అద్ధాలు పగలగొట్టి పిల్లలను బయటకు తీయాల్సి వచ్చింది. ఈ సమస్య కారులోని ఎలక్ట్రానిక్ డోర్ హ్యాండిల్స్ పనిచేయకపోవడం వల్ల జరిగింది. ఈ ఘటనలపై అమెరికాకు చెందిన నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ స్పందించింది. 2021 మోడల్ టెస్లా మోడల్ వైకి చెందిన సుమారు 1.74 లక్షల కార్లపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ కార్లలోని ఎలక్ట్రానిక్ డోర్ హ్యాండిల్స్ పనిచేయడం లేదని తమకు ఫిర్యాదులు అందాయని ఓ నివేదిక పేర్కొంది. ఎలక్ట్రానిక్ డోర్ లాక్‌కు తగినంత విద్యుత్ సరఫరా అందకపోవడం వల్ల ఈ సమస్య వస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ సమస్య ఎదురైన అనంతరం కొందరు కస్టమర్లు తమ కారులోని లో-వోల్టేజ్ బ్యాటరీని మార్చాల్సి వచ్చిందని వెల్లడించారు. అయితే బ్యాటరీ తక్కువగా ఉన్నట్లు ఎలాంటి హెచ్చరికలు కూడా రాలేదని వారు పేర్కొన్నారు. టెస్లా కార్లలో లోపలి నుంచి డోర్‌ను మాన్యువల్‌గా తెరిచే అవకాశం ఉన్నప్పటికీ.. పిల్లలు చిన్నవారు కావడంతో ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకోలేకపోయారు. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కు అందిన ఫిర్యాదుల్లో కారు డోర్ లాక్ అవ్వడంతో తల్లిదండ్రులు పిల్లలను బయటకు తీయలేకపోయారని, నాలుగు కేసుల్లో పిల్లలను కాపాడటానికి కిటికీ అద్దాలను పగలగొట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారం టెస్లా కార్ల భద్రతపై తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తోంది.
అమెరికాలో 1.74 లక్షల టెస్లా కార్లపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ
September 17, 2025
0
Tags