రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో నీట్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఒక విద్యార్థిని.. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఆత్మహత్యాయత్నం చేసింది. ఒక ప్రముఖ కోచింగ్ సెంటర్‌లో నీట్ కోచింగ్ తీసుకుంటున్న యువతి.. ఆ భవనం పైకెక్కి దూకేస్తానని అందర్నీ బెదిరించింది. దీంతో అక్కడ ఉన్నవారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చివరికి అక్కడ ఉన్నవారు నచ్చజెప్పి దగ్గరికి వెళ్లి ఆమెను అతి కష్టం మీద కిందికి తీసుకువచ్చారు. అనంతరం ఆమె సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఆత్మహత్యకు యత్నించిన ఆ విద్యార్థిని.. గత కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతోందని తెలిపారు. నీట్ కోచింగ్‌లో భాగంగా నిర్వహించే పరీక్షలు రాయడం ఆ యువతి మానేసిందని.. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే తిడతారని భయపడి.. ప్రాణాలు తీసుకోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఆ యువతి.. బిల్డింగ్ పైకి ఎక్కి దూకేందుకు ప్రయత్నించగా అక్కడ ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో తెగ వైరల్ అవుతోంది. ఆ విద్యార్థిని.. కోచింగ్ సెంటర్ బిల్డింగ్ అంచున కూర్చొని.. కాళ్లను వేలాడ దీసి.. కిందికి దూకేస్తానని బెదిరించడం ఆ వీడియోల్లో కనిపిస్తోంది. అది గమనించిన కోచింగ్ సెంటర్ సిబ్బంది, స్థానికులు.. ఆ యువతిని రక్షించడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి. యువతి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడంతో ఆ రోడ్డుపై భారీగా జనం గుమిగూడారు. ఈ క్రమంలోనే కోచింగ్ సెంటర్ సిబ్బంది.. మెల్లగా ఆ బిల్డింగ్ పైకి ఎక్కి ఆ యువతి వద్దకు చేరుకున్నారు. ఎట్టకేలకు ఆమెను కిందికి దూకకుండా అడ్డుకున్నారు. వారిలో ఒకరు ఆ యువతిని బలవంతంగా పట్టుకుని వెనక్కి లాగడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన గురించి ఆ యువతి తల్లిదండ్రులకు కోచింగ్ సెంటర్ నిర్వాహకులు సమాచారం అందించారు. అనంతరం వారు తమ కుమార్తెను ఇంటికి తీసుకువెళ్లారు. అయితే ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని పోలీసులు వెల్లడించారు.
జైపూర్‌లో కోచింగ్ సెంటర్ టెర్రస్ పైనుంచి దూకబోయిన నీట్ విద్యార్థిని !
August 30, 2025
0
Tags