దసరా తర్వాత "త్రిశూల్" కార్యక్రమం : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

Telugu Lo Computer
0


విశాఖపట్నంలో జరిగిన "సేనతో సేనాని" సమావేశానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా నుంచి కూడా వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. ప్రత్యేకంగా కర్ణాటక అభిమానులు అందించిన రాష్ట్ర జెండాను పవన్ స్వీకరించి తన భుజాన కప్పుకోవడం సభలో హైలైట్‌గా మారింది. ఈ సభలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దసరా తర్వాత "త్రిశూల్" కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు పవన్ ప్రకటించారు. దీనివల్ల ప్రతి క్రియాశీల కార్యకర్త, పార్టీ సెంట్రల్ కమిటీ నాయకులతో అనుసంధానం అవుతారని తెలిపారు. ''రాజకీయాలంటే వ్యాపారం కాదు.. డబ్బు సంపాదన కాదు. ప్రజల కోసం చేసే నిజమైన సేవే రాజకీయాలు'' అని స్పష్టం చేశారు. కుటుంబం, సినిమాల కంటే జనసేనకే నా ప్రాధాన్యం ఇచ్చాను. ఈ 11 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఎదురైనా తట్టుకుని నిలబడాం. అందుకే ప్రజల మేలు సాధ్యమైంది'' అని అన్నారు. 2019-24 మధ్య ఎన్నో అవరోధాలు ఎదురైనా కేంద్ర నాయకుల వద్ద సహాయం అడగలేదని స్పష్టం చేశారు. ప్రధాని, హోంమంత్రిని సహాయం అడగటానికి బదులు పార్టీ మూసుకోవడమే మంచిదనుకున్నానన్నారు. కష్టాలనెదుర్కొని ముందుకు సాగడమే తమ ధోరణి అని, ఆ ఐడియాలజీ ఉన్నవారే ఇంతవరకు తన వెంట నడుస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు. ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారం నుంచి ఏజెన్సీలో డోలీమోతల బాధలు చూసిన సందర్భం వరకూ తన హృదయం కదిలిందని పవన్ చెప్పారు. చిన్న సమస్యలు వచ్చినా కొందరు పారిపోయారని.. కానీ నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలే తన బలం అని చెప్పుకొచ్చారు. పేదలు, రైతులు, మహిళలు, యువత కోసం పార్టీ స్థాపించామని అన్నారు. అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం'' అని వివరించారు. జనసేన పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఉన్న సిద్ధాంతాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ''ఒక ఓటమి వచ్చినా మనం పారిపోలేదు.. నిలబడాం. ఇదే మన బలం. కష్టాలు తట్టుకుని, గుణంతోనే రికార్డు స్థాయి విజయం సాధించాం'' అని అన్నారు. జనసేన పార్టీ స్థాపన సమయంలో కేవలం 150 మంది మాత్రమే ఉన్నారని, నేడు 12 లక్షల క్రియాశీల కార్యకర్తలు ఉన్నారని పవన్ కల్యాణ్ గర్వంగా ప్రకటించారు. ''కార్యకర్తలే మన శక్తి. అందుకే వారిని వినటానికి అందరినీ ఇక్కడికి పిలిచాం'' అని అన్నారు. ఇకపై పార్టీ వ్యవహారాలను తానే నేరుగా ఆఫీస్ నుంచి పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)