ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్ కడ్ రాజీనామాతో అనివార్యమైన ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. అధినేత వైఎస్ జగన్ పార్టీ నేతలతో చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఇవాళ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అధికారికంగా ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఎన్డీయే నిలబెట్టిన అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ కు మద్దతిస్తున్నట్లు బొత్స వెల్లడించారు. ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ కు మద్దతివ్వడం వెనుక ఉన్న కారణాన్ని కూడా బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో నంబర్ గేమ్ ఉండొద్దనే మద్దతు ఇస్తున్నామని ఆయన తెలిపారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇదే విధానాన్ని అవలంబిస్తున్నట్లు ఆయన గుర్తుచేశారు. గతంలో రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. నంబర్ గేమ్ వద్దనే ఉద్దేశంతోనే అప్పట్లో ప్రణబ్‌కు సపోర్ట్ చేశామన్నారు. మరోవైపు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ వైసీపీ అని బొత్స సత్యనారాయణ తెలిపారు. వాస్తవానికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఎవరికన్న అంశంపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. గతంలో అధికారంలో ఉన్నా లేకపోయినా వైసీపీ మాత్రం కేంద్రంలో ఎన్డీయే నిలబెట్టిిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్ధులకే మద్దతిస్తూ వచ్చింది. అలాగే పార్లమెంట్ లో కీలక బిల్లుల విషయంలోనూ వైసీపీ ఎంపీలు కేంద్రానికి అండగా నిలిచారు. అందుకే ఈసారి కూడా ఎన్డీయే అభ్యర్ధికే ఉపరాష్ట్రపతిగా వైసీపీ మద్దతిస్తుందని అంతాా ఊహించిందే. ఈ విషయంలో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేయగానే జగన్ ఏమాత్రం ఆలోచించకుండా మద్దతు ప్రకటించేసినట్లు తెలుస్తోంది.
సీపీ రాధాకృష్ణన్ కు వైసీపీ మద్దతు !
August 21, 2025
0
Tags