బెంగళూరులోని ప్రజాప్రతినిధుల కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను కోర్టు దోషిగా నిర్ధారించింది. కోర్టు తీర్పును వినగానే ప్రజ్వల్ రేవణ్ణ కోర్టులోనే తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. శిక్ష ఖరారును రేపు అంటే ఆగస్టు 2న న్యాయస్థానం ప్రకటించనుంది. ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచార కేసు నమోదు అయిన 14 నెలల్లోనే ఈ తీర్పు వెలువడటం గమనార్హం. మాజీ ఎంపీ ఒక గృహ సహాయకురాలిపై రెండు సార్లు అత్యాచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ అత్యాచార ఘటనలకు సంబంధించి బాధితురాలు వీడియోను రికార్డు చేసింది. అంతే కాకుండా ఈ ఘటన జరిగిన సమయంలో తాను ధరించిన చీరను కూడా కీలక సాక్ష్యంగా భద్రపరిచింది. ఈ చీరను కోర్టులో కీలక ఆధారంగా సమర్పించారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఆ చీరపై వీర్యం ఆనవాళ్లు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఈ కేసు మరింత బలపడింది. కోర్టులో ఈ చీరను నిర్ణయాత్మక సాక్ష్యంగా సమర్పించారు. ప్రజ్వల్ రేవణ్ణపై ఐపీసీ, ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. మైసూరులోని కేఆర్ నగర్‌కు చెందిన ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ప్రజ్వల్ రేవణ్ణపై ఈ అత్యాచార కేసు నమోదైంది. మాజీ ఎంపీ తనపై అత్యాచారం చేసి, ఆ చర్యను వీడియో కూడా రికార్డు చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసు దర్యాప్తును కర్ణాటక సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అత్యంత పారదర్శకంగా, వేగంగా చేపట్టింది. సీఐడీ ఇన్‌స్పెక్టర్ శోభ, ఆమె బృందం ఈ దర్యాప్తునకు నాయకత్వం వహించారు. సిట్ దాదాపు 2,000 పేజీల సమగ్ర ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. దర్యాప్తు సందర్భంగా బృందం మొత్తం 123 కీలక సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించింది. ఈ కేసు విచారణ 2024 డిసెంబర్ 31న ప్రారంభమైంది. కోర్టు మొత్తం 23 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. అంతేకాకుండా వీడియో క్లిప్‌ల ఫోరెన్సిక్ నివేదికలు, సంఘటనా స్థల తనిఖీ నివేదికలు వంటి సాంకేతిక, భౌతిక సాక్ష్యాలను కూడా కోర్టు క్షుణ్ణంగా పరిశీలించింది. కేవలం ఏడు నెలల స్వల్ప వ్యవధిలోనే విచారణ ప్రక్రియ పూర్తయింది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత, ప్రత్యేక న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ తన తీర్పును రిజర్వు చేసి, ఇప్పుడు వెలువరించారు.
మాజీ హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా నిర్ధారించిన కోర్టు : రేపు శిక్ష ఖరారు
August 01, 2025
0
Tags