పంజాబ్‌లో వరదలు : మునిగిపోయిన వందలాది గ్రామాలు

Telugu Lo Computer
0


పంజాబ్ లో సట్లెజ్, బియాస్, రావి నదులు, ఇతర వాగులు, వంకలు ఉప్పొంగడంతో గురుదాస్‌పూర్, పఠాన్‌కోట్, అమృత్‌సర్, తరన్ తారన్, కపూర్తల, ఫిరోజ్‌పూర్, ఫాజిల్కా, హోషియార్‌పూర్ జిల్లాలలో వందలాది గ్రామాలు మునిగిపోయాయి. నాలుగు దశాబ్దాలలో ఎన్నడూ లేనంత అత్యంత తీవ్రమైన వరదలను ఎదుర్కొంటోంది. 1988 తర్వాత ఇంతటి అత్యంత భయానక విపత్తును పంజాబ్ ప్రజలు చూడలేదు.వర్షాలతో దెబ్బతిన్న పఠాన్‌కోట్ జిల్లాలోని మాధోపూర్ హెడ్‌వర్క్స్ వద్ద, కూలిపోయే దశలో ఉన్న భవనం నుండి 22 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బందిని, ముగ్గురు పౌరులను సైన్యం రక్షించింది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లోని క్యాచ్‌మెంట్ ఏరియాలలో అధిక నీటి ప్రవాహం, భాక్రా, పాంగ్, రంజిత్ సాగర్ డ్యామ్‌ల నుండి నీటి విడుదల కారణంగా పంజాబ్ కు ఇంతటి స్థాయిలో వరదలు సంభవించాయి. ఫలితంగా దాదాపు 1,018 గ్రామాలు వరదల బారిన పడ్డాయి. వీటిలో గురుదాస్‌పూర్‌లో 323, కపూర్తలలో 115, అమృత్‌సర్‌లో 100 గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాల పంట పొలాలు, ప్రధానంగా వరి పొలాలు నీట మునిగిపోయాయి. రైతులకు భారీ నష్టం వాటిల్లింది. వరదల కారణంగా 23 మంది మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. పఠాన్‌కోట్‌లో 8, హోషియార్‌పూర్‌లో 7 గురు వరదల కారణంగా మృతి చెందారు.

Post a Comment

0Comments

Post a Comment (0)