భారత్ సింధు జల ఒప్పందం నిలిపివేతను కొనసాగిస్తే యుద్ధం గురించి ఆలోచించడం తప్ప పాకిస్తాన్ కు వేరే మార్గం లేదు

Telugu Lo Computer
0


భారత్ పై కయ్యానికి కాలు దువ్వుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కలిసి అక్కడి నుంచే మన దేశానికి పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ హెచ్చరికలు చేశారు. దీనికి కొనసాగింపుగా ఇవాళ పాకిస్తాన్ మాజీ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టో హెచ్చరిక ఇచ్చారు. భారత్ తమకు తీవ్ర నష్టం కలిగించిందంటూ పాక్ మాజీ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టో సింధు జలాల ఒప్పందం రద్దు గురించి మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో భారత్ లో మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా పాకిస్తానీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు పాకిస్తాన్‌కు తీవ్ర నష్టం కలిగించాయని, ప్రధాని మోడీ, ఈ దురాక్రమణలకు వ్యతిరేకంగా మనం ఐక్యంగా నిలబడటం అవసరమంటూ సింధ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భుట్టో వ్యాఖ్యానించారు. భారతదేశం సింధు జల ఒప్పందం నిలిపివేతను కొనసాగిస్తే, పాకిస్తాన్ యుద్ధం గురించి ఆలోచించడం తప్ప వేరే మార్గం ఉండదని భుట్టో హెచ్చరించారు. పాకిస్థానీలు ఆరు నదులు (సింధు ఉపనదులు ) తిరిగి పొందేంత బలంగా ఉన్నారని, భారత్ ఈ మార్గంలో కొనసాగితే, మన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి యుద్ధం యొక్క అవకాశంతో సహా అన్ని ఎంపికలను పరిగణనలోకి తీసుకోవడం తప్ప మనకు వేరే మార్గం లేదన్నారు. తాము యుద్దాన్ని ప్రారంభించలేదని, సింధూర్ లాంటి దాడి చేయాలని భారత్ ఆలోచిస్తుంటే..పాకిస్తాన్‌లోని ప్రతి ప్రావిన్స్ ప్రజలు మీతో పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకోవాలని భుట్టో హెచ్చరించారు. ఇది మీరు ఖచ్చితంగా ఓడిపోయే యుద్ధమని, తాము తలవంచమంటూ ప్రగల్భాలు పలికారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తాజాగా అమెరికా గడ్డపై నుంచి భారత్ ను అణు యుద్ధంపై హెచ్చరించిన తర్వాత భుట్టో చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో భారతదేశంతో యుద్ధం జరిగి ఇస్లామాబాద్ ఉనికికి ముప్పు ఎదురైతే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తానని ఆసిమ్ మునీర్ బెదిరించారు.తాము ఒక అణ్వస్త్ర దేశమని, తాము పతనమవుతున్నామని అనుకుంటే, తమతో పాటు సగం ప్రపంచాన్ని కూడా పతనం చేస్తామని మునీర్ హెచ్చరించారు. పాకిస్తాన్‌కు నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించే సింధు జల మార్గాలపై భారతదేశం నిర్మించే ఏవైనా మౌలిక సదుపాయాలను నాశనం చేస్తామని మునీర్ హెచ్చరించారు. తమకు క్షిపణుల కొరత లేదని, భారతదేశం ఆనకట్ట నిర్మించే వరకు వేచి ఉంటామని, ఆ తర్వాత దానిని 10 క్షిపణులతో నాశనం చేస్తామన్నారు. సింధు నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదన్నారు. దీనిపై స్పందించిన భారత్ బ్లాక్ మెయిల్ కు లొంగబోమని తేల్చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)