ఛత్తీస్ గడ్ లోని కంకేర్ జిల్లాలో తన ప్రియుడికి బైక్ కొనాలన్న ఉద్దేశంతో ఓ ప్రియురాలు పట్టపగలు దొంగతనం చేసి పట్టుబడింది. ప్రియుడితో కలిసి తన బంధువుల ఇంట్లోనే నగదు, నగలు సహా, సుమారు రెండు లక్షల రూపాయల విలువైన వస్తువులను చోరీచేసి అడ్డంగా దొరికిపోయింది. ఆగస్టు 8వ తేదీన మధ్యాహ్నం హల్బా పోలీస్ స్టేషన్ పరిధిలోని కన్నయ్య పటేల్ అనే వ్యక్తి కూరగాయల అమ్మడానికి మార్కెట్ కి వెళ్లి, ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగింది. దీంతో అతను పోలీస్ స్టేషన్లో తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేశారు. ఇంట్లో రెండు పెట్టెల నుంచి 95వేల రూపాయల నగదు, బంగారం, వెండి ఆభరణాలు కనిపించకుండా పోయాయి అన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో వారు దొంగతనం జరిగిన రోజు కన్నయ్య ఇంటి దగ్గర 22సంవత్సరాల కరుణ పటేల్, 24సంవత్సరాల ఆమె ప్రియుడు తమర్ధవాజ్ విశ్వకర్మ అనుమానాస్పదంగా తిరిగినట్టు గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు ఆ ప్రియురాలు చెప్పింది విని షాక్ తిన్నారు. ప్రియుడికి బైక్ కొనివ్వడం కోసం డబ్బులు అవసరమని దొంగతనానికి ప్లాన్ చేసినట్టు కరుణ ఒప్పుకుంది. ఈ క్రమంలోనే ఆగస్టు ఎనిమిదో తేదీ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కరుణ బంధువుల ఇంటి తాళం పగలకొట్టి దొంగతనానికి పాల్పడింది. కరుణ దొంగతనం చేస్తుంటే ఆమె ప్రియుడు విశ్వకర్మ ఎవరు వస్తున్నారు అనేది గమనిస్తూ రెక్కి నిర్వహించాడు. ఇక దొంగిలించిన నగదును కరుణ ప్రేమికుడికి ఇచ్చి నగలను తన వద్ద ఉంచుకుంది. పోలీసులకు పట్టుబడిన తర్వాత నేరం అంగీకరించిన వీరిద్దరి నుండి దొంగిలించిన వస్తువులను రికవరీ చేసిన పోలీసులు వీరిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.
ప్రియుడికి బైక్ కొనేందుకు దొంగతనం చేసి పట్టుబడ్డ ప్రియురాలు !
August 14, 2025
0
Tags