కర్తవ్య భవన్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

Telugu Lo Computer
0


ఢిల్లీలో ఉమ్మడి కేంద్ర సచివాలయ ప్రాజెక్టు కింద నిర్మించిన మొదటి భవనమైన 'కర్తవ్య భవన్‌'ను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కింద మొత్తం పది కార్యాలయ భవనాలు నిర్మించనున్నట్లు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ తెలిపింది. సీసీఎస్‌-3గా పరిగణిస్తున్న కర్తవ్య భవన్‌లోకి కేంద్ర హోం, విదేశీ వ్యవహారాలు, పెట్రోలియం శాఖ, ప్రధాన మంత్రికి ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వైజర్‌ కార్యాలయాలు తరలించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సీసీఎస్‌-2, సీసీఎస్‌-3 భవనాలు వచ్చే నెలకి పూర్తికానుండగా, సీసీఎస్‌-10వ భవనం వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి, 6వ, 7వ భవనాలు వచ్చే ఏడాది అక్టోబర్‌ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. 2019లో ప్రారంభించిన సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో సిద్ధమైన మొదటి భవనమిదే కావడం గమనార్హం. 1950-1970 మధ్య నిర్మించిన శాస్త్రి భవన్, కృషి భవన్, నిర్మాణ్‌ భవన్, ఉద్యోగ్‌ భవన్‌లలో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు సీసీఎస్‌ ప్రాజెక్టు కింద నిర్మితమయ్యే కొత్త భవనాల్లోకి క్రమంగా మారనున్నాయి. నిర్మాణం పూర్తియ్యే వరకు నాలుగు భవనాలు నుంచి పనిచేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు రెండేళ్లపాటు కస్తూర్బా గాంధీ మార్గ్‌, మింటో రోడ్, నేతాజీ ప్యాలెస్‌లోని నాలుగు నూతన భవనాల్లోకి తాత్కాలికంగా తరలివెళ్లనున్నట్లు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ మంగళవారం తెలిపారు. కొత్త భవనాలలో నేషనల్ మ్యూజియం, నేషనల్ ఆర్కైవ్స్‌, జవహర్‌లాల్ నెహ్రూ భవన్ (విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ), డాక్టర్ అంబేద్కర్ ఆడిటోరియం ఉన్నాయి. సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రణాళిక కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొత్త పార్లమెంట్ భవనం, వైస్ ప్రెసిడెంట్ ఎన్‌క్లేవ్‌ను నిర్మించింది. విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు విస్తరించి ఉన్న కర్తవ్య మార్గాన్ని తిరిగి అభివృద్ధి చేసింది. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్‌తో పాటు ప్రభుత్వం ఒక ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్‌ను కూడా నిర్మిస్తుంది. దీనిలో ప్రధాన మంత్రి నూతన కార్యాలయం, క్యాబినెట్ సెక్రటేరియట్, ఇండియా హౌస్, జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్ రెండో దశలో ప్రధానమంత్రి కొత్త నివాసాన్ని సైతం నిర్మించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)